Sunday, September 8, 2024
HomeTrending Newsకేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటి

కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటి

CM Jagan Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను సిఎం జగన్ కలుసుకున్నారు.  రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు.

ప్రత్యేక తరగతి హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు.

ఆ తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియాను సీఎం జగన్‌ కలుసుకున్నారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.  దేశంలో విమానయాన రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవ, చేస్తున్న కృషికి సిఎం అభినందనలు తెలిపారు. విభజన తర్వాత విమానయానంతో సహా, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు సహకరిస్తామని 2014–రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందాని, అటు ఆర్థికపరంగానూ, ఇటు అనుమతుల విషయంలో కూడా తోడ్పాటు అందిస్తామని  చెప్పారని జగన్ గుర్తు చేశారు.

భౌగోళిక  పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నావికాదళం కేంద్రం ఉండడం) ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేకపోవడంతో, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

భోగాపురం రాష్ట్రానికి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని జగన్ పేర్కొన్నారు. భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడేళ్ళ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసే విధంగా సహాయ, సహకారాలు అందించాలని జ్యోతిరాదిత్య సింధియాను జగన్ కోరారు. ఈ సమావేశంలో వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్