Cheap Politics: చిన్నారులకు తమ ప్రభుత్వం గోరుముద్ద కింద నాణ్యమైన ఆహారంతో పాటు చిక్కీ కూడా అందిస్తుంటే.. దాని గురించి చెప్పకుండా.. చిక్కీ కవరుపై ఉన్న తన బొమ్మపై చంద్రబాబు, ఎల్లో మీడియా రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాగే కడుపుమంట, అసూయ పడుతుంటే దీనికి మందు లేదని, ఏదోరోజు బీపీ వస్తుందని, గుండెపోటుతో టికెట్ తీసుకోవాల్సి వస్తుందని మరోసారి ఘాటుగా విమర్శించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జగనన్న వసతి దీవెన మూడో ఏడాది రెండో విడత నిధులను పంపిణీ చేసే కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అయన మాట్లాడుతూ…. విద్యారంగంలో తాము ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే చంద్రబాబు, అయన దత్త పుత్రుడు, ఎల్లో మీడియా, వీరెవరికీ ఇవి కనబడడం లేదని, రోజుకో రకంగా బురద జల్లుతున్నారని విమర్శించారు.
ఆఖరుకు పార్లమెంట్ ను కూడా వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేస్తున్నారని , రాష్ట్ర పరువు ప్రతిష్టలను ను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు . ఏ రాష్ట్రంలో నైనా తమ సొంత రాష్ట్రం గురించి బైట మాట్లాడేటప్పుడు, పార్లమెంట్ లో చెప్పేటప్పుడు గొప్పగా చెబుతారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్య విపక్షం, ఎల్లో మీడియా, దత్త పుత్రుడు ఉన్నారని దుయ్యబట్టారు. కానీ ఇలాంటివేవీ తనను కదిలించలేవని, బెదిరించలేవని, దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చానని, ప్రజల అండ, దేవుని దయ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాలతో…. 18-23 ఏళ్ళ వయసు వారిలో గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో తమ ప్రభుత్వం రాకముందు 32.4 శాతం ఉంటే, 2019 నాటికి అది8.64 శాతం ఎక్కువగా పెరిగిందన్నారు. ఈ రేషియో పెరుగుదల సగటు జాతీయ స్థాయిలో 3.0 శాతం మాత్రమే ఉందన్నారు. ఆడపిల్లల విషయంలో ఈ రేషియో జాతీయ స్థాయిలో 2.28 ఉంటే రాష్ట్రంలో మాత్రం 11.03 శాతం పెరిగిందన్నారు.
తమ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల సంఖ్య 37లక్షల మంది ఉంటే ఇప్పుడు 44 లక్షల ౩౦ వేలకు పెరిగారన్నారు. విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు ఇది నిదర్శనమన్నారు.
Also Read : ఎల్లో మీడియాని బహిష్కరించాలి: సజ్జల