వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో నేడు మూడోరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ఇడుపులపాయ ఎస్టేట్ నుండి పులివెందుల చేరుకొని సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఏటా క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలేలు తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నా’నని అన్నారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందాలని సిఎం ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి.. 2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ వేడుకలో ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతమ్మ లతో పాటు.. వైఎస్ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి తదితర బంధువర్గాలు, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు… రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి. సుధా, తదితరుల పాల్గొన్నారు.