రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంగా చేపడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వనమహోత్సవం 2021’ కార్యక్రమాన్ని రావి, వేప మూకలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలోని అన్ని జీవులు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాయని, కేవలం చెట్లు మాత్రమే కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్పారు. ఒక చెట్టు వుంటే స్వచ్చమైన ఆక్సిజన్ లభిస్తుందని, దీనితో పాటు చెట్లు ఉంటేనే వర్షాలు బాగా పడతాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 23 శాతం ఉందని, దాన్ని ౩౩ శాతానికి పెంచేలా అందరం కృషి చేద్దామని విజ్ఞప్తి చేశారు. అటవీ పర్యావరణ శాఖ ద్వారా ఈ రోజు 5 కోట్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు. అటవీ పర్యావరణ పరిరక్షణ కోసం సభకు హాజరైన వారితో సిఎం జగన్ ప్రతిజ్ఞ చేయించారు.
ప్రజలకు ఆరోగ్య కరమైన ఆనందకరమైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని దాన్ని మొదటి స్థానానికి చేరుకొనేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వర్షాలు సరిగా పడేవి కాదని, జగన్ నాయకత్వంలో వర్షాలు సమృద్ధి సమృద్ధిగా పడుతున్నాయన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విపక్షాలు, మీడియా వక్రీకరిస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా, చిచ్చు పెట్టినా ఒరిగేదేమీ ఉండదని, ప్రజల మనస్సులో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, ప్రతి గుండెలో గూడు కట్టుకున్నారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ రంగనాథ రాజు, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, విడదల రజని, మద్దాలి గిరి , ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.