Saturday, January 18, 2025
HomeTrending Newsప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టాలి: సిఎం

ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టాలి: సిఎం

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గంజాయి సాగు చేస్తున్న వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలని నిర్దేశించారు.  మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు,  సహాయ సహకారాలు అందించాలన్నారు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై  క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. నాటుసారా తయారీలో ఉన్న వారిని కూడా  దాన్నుంచి బైటపడేయాలని, స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని  నిర్దేశించారు.

మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.– ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పారు. అన్ని అనుమతులూ పొంది ఆపరేషన్స్‌ చేయకపోతే ఆదాయాలు రావని సిఎం అభిప్రాయపడ్డారు.

ఎర్రచందనం విక్రయానికి అన్నిరకాల అనుమతులు వచ్చాయని, అక్టోబరు – మార్చి నెలల మధ్య 2640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధంచేశామని అధికారులు తెలియజేయగా ఈ విషయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో థర్డ్‌పార్టీ చేత కూడా పరిశీలన చేయించాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read :  దేశం గర్వపడేలా జగన్ పాలన: రోజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్