Wednesday, April 9, 2025
HomeTrending Newsనేడు వైఎస్సార్ రైతు భరోసా

నేడు వైఎస్సార్ రైతు భరోసా

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద  వరసగా నాలుగో ఏడాది, రెండో విడత సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా మూడు విడతల్లో  13,500 రూపాయల సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.  నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున ఇప్పటికే అందజేసింది. నేడు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయనుంది.  వచ్చే సంక్రాంతి రోజుల్లో  మూడో విడతగా మరో రూ. 2,000 అందించనుంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా  ఈ సాయాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తోంది. నేడు   అందిస్తోన్న రూ. 2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ళ నాలుగు నెలల్లో  ప్రభుత్వం ఇప్పటివరకు  వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా మాత్రమే  అందించిన సాయం 25,971.33 కోట్ల రూపాయలు అవుతోంది. అన్ని పథకాల ద్వారా రైతన్నలకు జగనన్న ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి దాదాపు రూ. 1,33,526.92 కోట్లు.

 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం, పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, 5 రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరల ప్రకటన, రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు లాంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి ఊతం అందిస్తున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also Read : గంజాయి పేరుతో కొత్త నిందలు: విజయసాయి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్