నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి వడ్డీ లేని ఋణం అందించే ‘జగనన్న తోడు’ నాలుగో ఏడాది తొలివిడత సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించనున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేలు చెల్లిస్తూ.. సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా క్రమంగా ఏటా రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకూ వడ్డీలేని రుణం అందిస్తున్నారు.
5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.560.73 కోట్లను నేడుక్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరువ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు(వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి పలుమార్లు రుణం కోరి పొందినవారు 13,29,011 మంది) అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,955.79 కోట్లు అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ.11.03 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.31 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకుజగన్ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు అని పేర్కొంది.
చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.