Saturday, November 23, 2024
HomeTrending NewsBandar Port: బందరు పోర్టు పనులకు నేడే శ్రీకారం

Bandar Port: బందరు పోర్టు పనులకు నేడే శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం,  మంగినపూడిలో నేడు మే 22న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఖరారు చేసి , ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసి ఈ రోజు  పోర్టు నిర్మాణ పనులు మొదలు పెడుతున్నారు.  స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో కేవలం 6 పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా పనులు జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి, నేడు బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ…మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభిస్తున్నారు

35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 2 జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు వినియోగపడేలా మొత్తం 4 బెర్తులతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరగనుంది. 24–30 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.  భవిష్యత్ వాణిజ్య కార్యకలాపాలకు, ట్రాఫిక్‌కు అనుగుణంగా 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యం వరకు పోర్టు విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మొత్తంగా సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో  చేపడుతోన్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

2035 నాటికి రాష్ట్రంలో బ్లూ ఎకానమీ 20 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని,  దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్ధికాభివృద్దిలో కీలకంగా మచిలీపట్నం పోర్టు ఉంటుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్