ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సిఎం జగన్ నేడు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు విడతల్లో కంటి పరీక్షలు చేయించుకొని వారికి ఈ విడతలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు చేసి కళ్ళద్దాలు అందించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు.
ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామని, పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్‌హెల్త్ క్లినిక్స్ లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం, ఒక సీహెచ్‌ఓ, 3–4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారని వివరించారు. ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగం కావాలని సిఎం సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు పైన కూనా సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌కాలేజీల్లో పనులు కొనసాగుతున్నాయని, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023–24 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. విజయనగరం మెడికల్ కాలేజీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చారని, మిగతా కాలేజీలకూ అనుమతులు రానున్నాయని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం