వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తొలిదశలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జరగనున్న ఈ పర్యటన ఈనెల 26 లేదా 27 తేదీల్లో మొదలుకానుంది. సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 చోట్ల జగన్ ఈ యాత్ర రూట్ మ్యాప్ ఉండబోతోంది. బస్సు యాత్ర మొదలు పెట్టిన రోజునుంచి పూర్తయ్యే వరకూ సిఎం జగన్ జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు. పార్టీ ముఖ్యనేతలు, ప్రచార కార్యదర్శులు, మీడియా కోర్దినేటర్ల తో జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఉదయం పూట వివిధ వర్గాల ప్రజలతో, సామాజిక కార్యకర్తలతో జగన్ మమేకం కానున్నారు. సాయంత్రం బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం అక్కడే బస చేస్తారు లేదా మరుసటిరోజు యాత్ర జరిగే నియోజకవర్గానికి చేరుకొని అక్కడ బస చేయనున్నారు. ఈ ప్రచార కార్యక్రమం పూర్తయిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటన ఉంటుంది. మొదటి ఐదారు రోజుల యాత్ర రోడ్ మ్యాప్ తో పాటు పూర్తి షెడ్యూల్ ను రేపు ఉదయం విడుదల చేస్తామని రఘురాం తెలిపారు.