రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రోజు ముందుగానే ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి సిఎం జగన్ ఎల్లుండి, అక్టోబర్ 6 న ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. ఆరు, ఏడు తేదీల్లో ప్రధాని, హోం మంత్రి, పలువురు ఇతర కేంద్ర మత్రులను సిఎం కలుస్తారని తెలిసింది. అయితే సిఎం పర్యటనలో హఠాత్తుగా మార్పులు జరిగాయి. రేపు గురువారం ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి బయల్దేరనున్నారు.
మోడీ, షాలతో సమావేశం సందర్భంగా విభజన హామీలు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎల్లుండి శుక్రవారం ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే సమావేశంలో సిఎం పాల్గొంటారు.