Tuesday, September 17, 2024
HomeTrending NewsTelangana Martyrs: ఘనంగా అమరుల స్మారకం ఆవిష్కరణ

Telangana Martyrs: ఘనంగా అమరుల స్మారకం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎం కి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు అమరులకు నివాళలర్పించి, తెలంగాణ అమరవీరుల స్మారక భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మినీ థియేటర్ లో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సాధనా క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రదర్శన అనంతరం సీఎం తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని స్విచ్ ఆన్ చేసి ప్రజ్వలన చేశారు.

అనంతరం అమరవీరుల స్మారక భవనం నుండి సభా వేదిక వద్దకు సీఎం చేరుకున్నారు. గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అమరుల నివాళి గీతం ఆలపిస్తుండగా, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ కొవ్వొత్తుల వెలుగుల‌తో అమరవీరులకు నివాళుల‌ర్పించారు. సభా వేదికకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు వెలుగుతున్న కొవ్వొత్తులను ప్ర‌ద‌ర్శిస్తూ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ స‌త్క‌రించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

అమరుల స్మారక సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు

• ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్ర కోణాలు దాగి ఉండి, అమాయకమైన నాటి రాజకీయ నాయకత్వం, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మనం బలై పోయినం. ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలైనయి.
• మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ పొలికేక మొదలై, అక్కడి నుండి అక్క‌డ్నుంచి 1965, 1966 నుంచి మొద‌లుకొని 1967 కు చేరుకునే వరకు యూనివర్సిటీలకు, విద్యార్థులకు చేరుకోవడం జరిగింది. స్వామి గౌడ్ వంటి ధైర్యశాలులు, టిఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ నాటి అణచివేత పరిస్థితుల్లో కూడా 58 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఆసాంతం ఉద్యమంలో ఉన్నారు.
• ఎన్నో రకాల కేసులు, ఎన్నో రకాల వేధింపులు, పిడి యాక్టులు, ఉద్యోగాల భర్తరఫ్ లు తెలంగాణ అనుభవించని బాధ లేదు.
• ఆనాటి టీఎన్జీవో నేత ఆమోస్ వంటి వారిని మీసా యాక్ట్ కింద ఉద్యోగాల నుండి తీసేస్తే బద్రి విశాల్ పిట్టి అనే ఒక వ్యాపార వేత్త బకెట్లు పట్టుకొని దుకాణాదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. ఇలా మహత్తరమైన పోరాటాన్ని మన టిఎన్జీవోలు జరిపారు.
• నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా మ‌న విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వ‌చ్చి పోరాటం చేశాయి.


• ఉద్య‌మం ప్రారంభించిన మొదట్లోనే నా మిత్రుడు వి. ప్ర‌కాశ్, మాజీ అసెంబ్లీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి లాంటి పిడికెడు మందితో మేధోమ‌ద‌నం చేశాం. రాష్ట్రం సాధించి తీరాల‌నే ఉద్దేశంతో అనేక మంది వ్య‌క్తుల‌ను క‌లిశాం. ఒక చక్కటి వ్యూహాం ర‌చించుకుని బ‌య‌ల్దేరాం.
• ఆ సంద‌ర్భంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌ ని క‌లిశాం.. అనేకమంది అనేక రూపాల్లో కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయి నీరుగారి పోయేవారుంటారు. జయశంకర్ రెండు సిద్ధాంతాలు బ‌లంగా ఉండేవి. ఒక‌టి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. రెండోది శ‌నివారం పూర్తిగా ఉప‌వాసం ఉండేవారు. ఆ రకంగా ఆయ‌న ఆజ‌న్మ తెలంగాణ‌వాది. ఏ ఒక్క సంద‌ర్భంలో కూడా వెనుక‌డ‌గు వేయ‌లేదు.
• మ‌లిద‌శ ఉద్య‌మంలో అనేక ర‌కాల చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు, హింస‌, పోలీసు కాల్పులు, 1969 లో దాదాపు 400 మంది చనిపోవడం, ఉద్య‌మం నీరుగారిపోవ‌డం వంటి ఘట్టాలను మనం చూశాం.
• ఎల్లకాలం మన గుండెల్లో నిలిచే విధంగా ఈ అమర జ్యోతిని మనం పెట్టుకున్నాం. అమరుల పేరు ఎప్పటికీ మన నోళ్ళలో ఉండే విధంగా ఇందులో హాల్ నిర్మాణం చేశారు. కొంతమంది మిత్రులు, పాత్రికేయ మిత్రులు ఈ దిశగా సాయమందించారు.
• 1969 ఉద్యమం నాటి ఫోటోలను కలెక్ట్ చేశాం. ఇంకా మిగిలినవి కూడా కలెక్ట్ చేసి, అమరుల పేర్లతో సహా ఒక ప్రత్యేకమైన స్థానంలో అలంకరిస్తాం. ఎందుకంటే ఉద్యమం ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. దీనికొక ప్రత్యేకత ఉంది.
• 1969 లో కొంత హింస ధోరణి చూపింది.
• మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే అహింసాయుతంగా ముందుకు సాగాం.
• మిత్రుడు దేశపతి శ్రీనివాస్ చెప్పినట్లు మాకు దేవుడిచ్చిన శక్తినంతా కూడగట్టుకొని హింస జరగకుండా చూశాం.
• నా మీద సమైక్య వాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద చేసిన దాడి ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా కూడా నేను ఏనాడు బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్న కాబట్టీ ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అనుకున్నాను గానీ వీటి గురించి బాధపడలేదు
• కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆనాడు బయలుదేరినాం. ఆ సందర్భంలో నేను దీక్షలో కూర్చుంటే, నాతో బాటు చాలా చోట్ల దీక్షకు కూర్చున్నారు.
• అప్పుడు డాక్టర్లు నేను కోమాలోకి పోతే తిరిగి కోలుకోలేనని డాక్టర్లు హెచ్చిరించారు. అప్పుడు నాకు మద్దతుగా విద్యార్థుల, ప్రజల నిరసనలతో ఢిల్లీ సర్కారు దిగివచ్చి లోక్ సభలో చర్చకు పెట్టింది. ఈ ఘట్టాన్ని నేను నిమ్స్ హాస్పటల్ లో నిరాహార దీక్ష చేస్తూ చూశాను. ఆనాటి ప్రధాని మీద లోక్ సభ దద్దరిల్లేటట్టు చర్చలు జరిపితే, మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇస్తమనే ప్రకటన వచ్చింది. దాని తర్వాత నేను దీక్ష విరమించాను.
• అందిన సమాచారం ఆధారంగా ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చాం. ఇంటికి పది లక్షల రూపాయలిచ్చాం. ఇల్లు లేనివారికి ఇల్లు కూడా సమకూర్చినం. ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
• తెలంగాణ బిడ్డల త్యాగాలే నన్ను బాధ పెట్టాయి. నన్ను వ్యక్తిగతంగా హింసించినా నేను బాధ పడలేదు. కానీ అనూహ్యంగా తెలంగాణ బిడ్డల బలిదానాలు నన్ను కలిచివేసింది. బాధ కలిగింది.
• అక్కడక్కడ కొంతమంది మూర్ఖులుంటారు. వారికి తత్తరపాటు, తొందరపాటు ఎక్కువుంటుంది. అమరుల స్థూపం ఏమైంది అని అక్కడక్కడ కొంతమంది మాట్లాడారు.


• మలేషియా, చైనా, సింగపూర్ కు పోయినప్పుడు అక్కడ అమరులకు కట్టిన స్మారకాలను చూసి తెలంగాణ అమరులకు స్మారకాన్ని యూనిక్ గా కట్టాలని భావించాను. అద్భుతమైన కళాకారుడు మిత్రులు రమణారెడ్డి ని పిలిపించుకొని, ఈఎన్సి గణపతి రెడ్డి ని పిలిచి మాట్లాడితే నా సూచనల ప్రకారం ఈ అమరజ్యోతికి రూపమిచ్చారు. ఖర్చు, సమయంతో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండిపోయేలా రూపొందించమని చెప్పాను.
• ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులు వచ్చినా, ఎవరు వచ్చినా అమరుల జ్యోతికి పుష్పాంజలి ఘటించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇకముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇలాగే జరుగుతాయి.
• ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి, ఇంజనీర్లు అందరూ కలిసి అద్భుతమైన రీతిలో అమరుల జ్యోతిని రూపొందించారు.
• తెలంగాణ చరిత్రను కండ్లకు కట్టే విధంగా ఫోటో గ్యాలరీని, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చరిత్రను సమగ్రంగా ఇక్కడ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
• 1969 ఉద్యమం, తరువాత మలిదశ ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన వివరాలుంటే ప్రభుత్వానికి పంపిస్తే, ప్రభుత్వం ఇందులో చేరుస్తుందని విన్నవిస్తున్నాను.
• మరొక్కమారు తెలంగాణ అమరవీరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ, జోహార్లు అర్పిస్తున్నాను.
• జై తెలంగాణ
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు తారక రామారావు, హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ , మల్లారెడ్డి , ఎంపీలు కేశవ రావు, నమ నాగేశ్వర్ రావు , జోగినపల్లి సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డిప్యూటీ స్పీకర్ పద్మ రావు , ఎమ్మెల్సీలు మధుసూధనా చారి,కవిత పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, రసమయి బాలకిషన్, లక్ష్మా రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, గొంగిడి సునీత, పద్మ దేవేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్