Friday, January 24, 2025
HomeTrending NewsHare Krishna Tower: హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భూమిపూజ

Hare Krishna Tower: హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భూమిపూజ

హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీ కృష్ణ గో సేవామండలి విరాళంతో హేరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణంకు చర్యలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని అన్నారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని కేసీఆర్ అన్నారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే అన్నారు. హరేకృష్ణ ఫండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఎంతో చిత్తశుద్ది ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు :

రాహుల్ సాంకృత్యాయన్ గొప్ప రచయిత. వోల్గా నుంచి గంగా అనే తన గొప్పరచన ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. వేదాల్లోని, ఉపనిషత్తులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని అది పంచిన సందేశాన్ని విశ్వానికి పంచితే అంతకు మించి పరమార్థం లేదని, కొంతమంది వేదాల సారాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారనే విషయాన్ని రాహుల్ సాంకృత్యాయన్ గారు ఉద్గాటించారు. హరే కృష్ణ వారు తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటు గొప్పది. అక్షయపాత్ర వారు అన్నపూర్ణ ద్వారా అందిస్తున్న భోజనం చిన్నారి స్కూల్ పిల్లలనుంచి ముదులు కొని హైదరాబాద్ లో ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా ఎక్కడి నుండి కంప్లేట్ లేకుండా చేస్తున్నారు. ఇది వారి అంకితభావానికి నిదర్శనం. అక్షయపాత్ర వారికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు.

సందర్బం ఎప్పుడు వచ్చినా.. అది కలరా కాని, కరోనా కానీ మీము ముందు వరసలో వుంటామని వారు ముందుకు వస్తుంటారు. మతం పేరిట చెలరేగేటువంటి దుష్పరిణామాలను నివారించేందుకు, అది పేట్రేగకుండా వుండడానికి హరేకృష్ణ సంస్థ కూడా కృషి చేయాలి. మతాన్నీ హృదయపూర్వకంగా విశ్వసించే వారు మతమౌఢ్యం ఎప్పుడూ కోరుకోలేదు. విశ్వశాంతిని కోరుకునే యజ్ఞాలు మనం చేస్తాం. హరే కృష్ణ వారు చేపట్టిన దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నాను. వీటిని త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. శాంతిని, ఆధ్యాత్మికతను పెంపొందించే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తుంది.

మధు పండిత్ చెప్పినట్లుగా అత్యధ్బుతంగా నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట దేవాలయానికి సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి. అదే విధంగా ఆధ్యాత్మికతను పెంపొందించే వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను కూడా అభివృద్ది చేస్తున్నాం. దేశానికి, విశ్వానికి శాంతియుత సమాజమే రేపటి భవిష్యత్తు అని మేము భావిస్తున్నాము.

ఈ సందర్భంగా కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, ఎమ్మెల్యేలు.. టి.ప్రకాష్ గౌడ్, జయపాల్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి, టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు హరే కృష్ణ మూవ్‌మెంట్ చైర్మన్ మధు పండిత దాస, హరే కృష్ణ మూవ్‌మెంట్-హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాసతో పాటు శ్రీకృష్ణ గోసేవామండలి కార్యదర్శి సురేష్ కుమార్ అగర్వాల్, అరబిందో ఫార్మ లిమిటెడ్ ఎండీ నిత్యానందరెడ్డి, శ్రీ కృష్ణ గోసేవా మండలి ట్రస్టీ శ్యామ్ సుందర్ గుప్తా, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ కెటి. మహే తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ నిర్మణానికి సంబంధించిన అదనపు సమాచారం
హైదరాబాద్ నార్సింగిలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ను రూ.200 కోట్లతో ఆరు ఎకరాల విశాలమైన స్థలంలో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తున నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ నగరానికి మరో సాంస్కృతిక మైలురాయిగా నిలువనుంది. శ్రీ రాధాకృష్ణ మరియు శ్రీ శ్రీనివాస గోవిందుల దేవాలయాలతో పాటు సువిశాల గోష్పాద క్షేత్రంలో (ఆవులతో పవిత్రం చేయబడిన భూమి) ఇది నిర్మితం కానుంది. ఇందులో 1500 మంది భక్తులకు వసతి సౌకర్యం అందుబాటులో వుంటుంది. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా కాకతీయుల నాటీ నిర్మాణ కౌశలంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకేసారి 500 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేలా వసతి ఏర్పాటు చేస్తారు. లైబ్రరీ, కళ్యాణి అడిటోరియం, ఐమాక్స్ ఒపన్ ఎయిర్ థియోటర్లు, లెక్చర్ హాల్స్, క్యూకాంప్లెక్స్, గెస్ట్ రూంలు వుంటాయి. భగవాన్ కృష్ణుని చరిత్ర వారి భోదనల సారం నేటి యువతకు అర్థం అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేజర్ ప్రదర్శనలు వుంటాయి. ఇట్లా ఎన్నో విశిష్టతలు, సౌకర్యాలు మరియు సదుపాయాలతో రూపుదిద్దుకొనున్న ఈ నిర్మాణం దేశవిదేశాలనుండి లక్షలాది పర్యాటకులను ఆకర్షించనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్