హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, కాలేరు వెంకటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మూడు ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టిమ్స్‌ను 1000 బెడ్ల సౌకర్యంతో నిర్మించనున్నారు. ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్స్‌తో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఎర్రగడ్డ టిమ్స్..
17 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు.
కొత్తపేట టిమ్స్..
21.36 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.
అల్వాల్ టిమ్స్..
28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.
జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ సేవలు
గ్రేటర్ చుట్టూ నిర్మించనున్న నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు కూడా వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ముఖ్యంగా అల్వాల్–ఓఆర్‌ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా వైద్యసేవలు సకాలంలో పొందే వీలుంటుంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల నల్లగొండ, వరంగల్, యాదాద్రి–భువనగిరి తదితర జిల్లాల ప్రజలకు, గచ్చిబౌలిలోని టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ కావడంతో పాటు సులభంగా దవాఖానలకు చేరుకునే వీలుంటుంది. ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రేటర్ సరిహద్దులో ఉన్న నూతన సూపర్‌స్పెషాలిటీ దవాఖానల ద్వారా సేవలు పొందే వీలుంటుంది.
Also Read : బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్