యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు. తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడంతో గ్రామస్తులు తమ సంతోశం వ్యక్తం చేశారు. మరికొందరు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామస్తులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు సీఎం స్వయంగా వంటకాలను వడ్డించారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజన ఏర్పాట్లు చేశారు. వాసాలమర్రిలోని కోదండ రామాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
23 రకాల వంటకాలు..
వాసాలమర్రి గ్రామస్తులకు 23 వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఆకుకూరలు, బోటీ కర్రి, చేపలు, తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్ పన్నీరు, బిర్యానీ, పులిహోర, సాంబార్, పండ్ల రసాలు, ఆలుగడ్డతో పాటు పలు వైరెటీలు చేశారు