Wednesday, March 18, 2026
HomeTrending NewsHail Storm Help: త్వరలో అర్హులకు పోడు భూముల పట్టాలు

Hail Storm Help: త్వరలో అర్హులకు పోడు భూముల పట్టాలు

అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం..తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవిన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నష్ట పోయిన పంటలకు ఆర్థిక సాయం :

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సిఎం కేసీఆర్ పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సిఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నేటి సమీక్షా సమావేశంలో సిఎం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా.. ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఎ ఈ వో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సిఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ను సిఎం ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సిఎం స్పష్టం చేశారు.

గొర్రెల పంపిణీ :

ఇప్పటికే ప్రకటించిన విధంగా.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సిఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని సిఎం స్పష్టం చేశారు.

పేదల ఇండ్ల నిర్మాణానికి సాయం :

ఖాళీ జాగలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని సిఎం స్పష్టం చేశారు.

పోడు భూముల పంపిణీకి సంసిద్ధత :

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో…అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీ కి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి, సిఎస్ శాంతి కుమారితో ముఖ్యమంత్రి సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. 1 లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్ బుక్కులు ముద్రించి సిద్దంగా వున్నామని అధికారులు సిఎం కు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్దంగా వున్నామని అధికారులు సిఎం కేసీఆర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో.. అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సిఎం తెలిపారు.

శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు :

శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 30 న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

Also Read : Hail Storm: ఎకరానికి పదివేలు పరిహారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular