Saturday, November 23, 2024
HomeTrending NewsBRS: కారు ప్రయాణం సాఫీగా సాగుతుందా!

BRS: కారు ప్రయాణం సాఫీగా సాగుతుందా!

రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ఈ రోజు(నవంబర్) వరకు పరిణామాలను విశ్లేషిస్తే కారు స్పీడు తగ్గించేందుకు ఓటర్లు సిద్దం అయ్యారని అంటున్నారు. సూడవోతే తెలంగాణ మార్పు దిశగా కదులుతోంది అన్నట్టుగా ఉంది. కొందరికే దళితబంధు, నిరుద్యోగుల అసంతృప్తి, రైతుబందు మాయాజాలం, కాళేశ్వరం లీకేజీలు మొదలైనవి కారు గాలి తీస్తాయని విపక్షాలు విశ్వాసంతో ఉన్నాయి. సిఎంను ఇంటికి తోలేందుకు ఓటర్లు బయిలెల్లిండ్రు అంటున్నరు.

అభ్యర్థుల వారిగా విశ్లేషిస్తే రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా… బీఆర్ఎస్ సెట్టింగ్ లకు వ్యతిరేకత ఉండటం సహజం. అభివృద్ధి కార్యక్రమాలే అజెండాగా బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది. మేనిఫెస్టోలో చెప్పిన వాటికి అదనంగా పనులు చేశామని సిఎం, మంత్రులు ప్రస్తావిస్తున్నారు.

గత ఎన్నికల ప్రచారానికి భిన్నంగా సిఎం కెసిఆర్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులతో పాటు పార్టీల నాయకత్వం, అజెండా కూడా పరిశీలించాలని కోరుతున్నారు. ఏ నియోజకవర్గానికి వెళితే అక్కడి స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ – బీఆర్ఎస్ ల మధ్య  తేడా వివరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో రోజుకు ఆరు సభల్లో పాల్గొన్న సిఎం ఈ దఫా మూడు బహిరంగ సభలకు మాత్రమే హాజరవుతున్నారు.

నిన్నమొన్నటి వరకు ఢిల్లీ మీద జెండా ఎగురవేస్తామని చెప్పిన కెసిఆర్ TRSను BRSగా మార్చారు. మహారాష్ట్రలో విరివిగా పర్యటించారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల హక్కులు పరిరక్షణ సాధ్యమని ఎన్నికల ప్రచారంలో చెప్పటం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశం ఓటర్లపై ప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు భయపడుతున్నాయి.

జాతీయ పార్టీగా మార్చటంలో ఎవరి ప్రోద్భలం ఉందనేది బయటపడకపోయినా బిజెపి మంత్రాంగం చేసిందని వినికిడి. బిజెపికి మేలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల్లో ఓట్లు చీల్చే దిశగా బీఆర్ఎస్ వచ్చిందని విశ్లేషణలు జరిగాయి. అందులో వాస్తవం ఎంతో గాని పార్టీ శ్రేణులు కూడా నిరాశకు గురయ్యాయి. పీపుల్స్ వార్ మావోయిస్ట్ కమ్యునిస్ట్ సెంటర్ లో విలీనం అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం వేగంగా తగ్గిపోయింది. కారణాలు ఏవైనా ఈ రెండు అంశాల్లో సారూప్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

2018 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల మీద కొంత అసంతృప్తి ఉండింది. టిడిపితో కాంగ్రెస్ పొత్తు, కెసిఆర్ పర్యటనల తరువాత మార్పు వచ్చింది. 2023 ఎన్నికలలో ఆ పరిస్థితి లేదు. ఆంధ్ర నాయకులు లేరు. సిఎం కెసిఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ప్రసంగాలు పూర్తి గెలుపు విశ్వాసంతో సాగుతున్నాయి.

దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీలో అస్మదీయులకు ఆదరణ విమర్శలకు తావిస్తున్నాయి. నవంబర్ 8వ తేది నాటికి గులాబీ పార్టీ మీద ఓటర్లు గుర్రుగా ఉన్నట్టు వివిధ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు బుంగ పడటం గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. ప్రజా మెప్పు కోసం సిఎం కెసిఆర్ ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

మూడోసారి గెలిస్తే సిఎం కెసిఆర్ చరిత్ర సృష్టించనున్నారు. దక్షిణ భారత దేశంలో వరుసగా మూడుసార్లు సిఎం పదవి చేపట్టిన  నాయుకుడిగా నిలుస్తారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్