Vidya Kanuka: రేపటితరం భవిష్యత్తుమీద దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో విద్యార్ధులు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందనే దానిపై ఆలోచన చేసి … ఈ పోటీలో నిలబడగలుగతారా ? లేదా ? ఆ పోటీలో నిలబడడమే కాకుండా… ప్రపంచంతో పోటీపడి నెగ్గుకు రావాలన్న ఆరాటంతో మొత్తం విద్యావ్యవస్ధలోనే మార్పులు తీసుకువచ్చామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో పుస్తకాలు, బూట్లు, యూనిఫాం లాంటి వస్తువులు అందించే విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఆదోనిలో సిఎం జగన్ ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది (2022–23 విద్యాసంవత్సరానికి) జగనన్న ‘విద్యా కానుక – బడికి వెళ్లడం ఇక వేడుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. బడులు తెరిచిన తొలిరోజు నుండే విద్యార్ధులకు ఈ వస్తువులు పంపిణీ చేస్తుండడం గమనార్హం.
ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌తో పాటు వారికి చదువులు సులభంగా అర్ధమయ్యే విధంగా.. ఇంకామెరుగైన చదువులు అందుబాటులోకి వచ్చే విధంగా… శ్రీమంతుల పిల్లలకే పరిమితమై, రూ.24 వేల వ్యయమయ్యే బైజూస్ కంటెంట్ ను పేద విద్యార్ధులకు అందించేందుకు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. బైజూస్ కంటెంట్ కోసం 8వతరగతిలోకి అడుగు పెట్టిన ప్రతి విద్యార్ధికీ ఈ సెప్టెంబరులో ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నామని, దాని విలువ దాదాపు రూ.12వేలు అని అంచనా వేశామని చెప్పారు. 4.70 లక్షల మంది పిల్లలు 8 వతరగతిలోకి అడుగుపెట్టబోతున్నారని, ట్యాబ్ విలువ రూ.12 వేలు అంటే మరో రూ.500 కోట్లు పిల్లల భవిష్యత్ మీద ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు.
2020–21 విద్యా సంవత్సరంలో సగటున ఒక్కో కి ట్‌కు రూ.1531 చొప్పున 42,34,322 మందికి రూ.650 కోట్లు, 2021–22లో ఒక్కో కిట్‌కు సగటున రూ.1726 చొప్పున 45,71,051 మంది పిల్లలకు రూ.790 కోట్లు వ్యయంతో విద్యాకానుక కిట్లు అందజేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మూడో ఏడాది ఏకంగా ఒక్కో కిట్టుకు రూ.1964 ఖర్చయ్యిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతారని భావిస్తున్నాం. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు 47 లక్షల మంది పిల్లలకు విద్యా కానుక కిట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీనికోసం రూ.931 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వివరించారు.
ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ చదువులు చదవాలని, ప్రపంచంతో పోటీ పడాలని, అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడే పరిస్థితి వస్తుందని సిఎం ఆకాంక్షించారు. దీనికోసమే విద్యారంగంలో….. మనబడి నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణం, అమ్మఒడి, ఇంగ్లిషు మీడియం చదవులు, విద్యా దీవెన, వసతి దీవెన , బైజూస్ కంటెంట్ లాంటి 9 ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.
“పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని నేను గట్టిగా నమ్ముతాను. పేదరికం పోవాలంటే మన పిల్లలు ఆ పేదరికం జయించ గలిగేది కేవలం మంచి ఇంగ్లిషు మీడియం చదవులతోనే సాధ్యం. ఆ పిల్లలు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని మనసా, వాచా, కర్మేణా కోరుకుంటా.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అని సీఎం తన ప్రసంగం ముగించారు.