ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకే నగరంలో నేడు బస చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను కలుసుకుని వారికి అందిన సహాయ పునరావాస కార్యక్రమాలపై ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేందుకు సిఎం నేడు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కూనవరం మండలం కోతులగుట్ట, కుక్కునూరు మండలం గొమ్ముగూడెం ప్రాంతాల్లో బాధితులను కలుసుకుంటారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు ఆదివారం రాత్రి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి రాజమహేంద్రవరంలోనే బస చేయనున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ ఒకే నగరంలో బస చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.