ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చటం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచటం, ధరణి లోపాలపై కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు, పోలీసు శాఖలో సమర్థవంతంగా పని చేసే అధికారులకు పట్టం కట్టడం మొదలైనవి ఉన్నాయి.
అదే కోవలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో మార్గాన్ని రద్దు చేయటం శుభపరిణామం. కేవలం కొందరు బడాబాబులకు ఉపయోగపడే ఈ మెట్రో మార్గం ఖజానాపై పెనుభారం. ఈ మార్గం ఖర్చుతో కూడుకున్నదని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా బాహుళ్యం అధికంగా ఉన్న తూర్పు, మధ్య హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించటం…ప్రజారంజకమైన నిర్ణయమని చెప్పవచ్చు.
ఎల్.బి నగర్ నుంచి విమానాశ్రయం మార్గం పూర్తి చేస్తే నగరంలో తూర్పు నగరవాసులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విజయవాడ, ఖమ్మం, వరంగల్ తదితర దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సులువుగా విమానాశ్రయం చేరుకోవచ్చు. MGBS నుంచి విమానాశ్రయం మార్గం పూర్తి చేస్తే సెంట్రల్ హైదరాబాద్ వాసులకు… ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే వారు JBS నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది.
మెట్రో మొదటి దశ పూర్తి చేయని గత ప్రభుత్వం శంషాబాద్ మార్గంపై ఉరుకులు పరుగులు పెట్టింది. దీనిపై ప్రజాసంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. తక్కువ ఖర్చుతో విమానాశ్రయం చేరుకునేందుకు అవకాశం ఉన్న MMTS ఎయిర్పోర్ట్ నిర్మాణంపై దృష్టి సారించలేదు. MMTS మార్గాలు పూర్తైన ప్రాంతాలకు రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవటం నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రజాసంఘాలు, నేతల విన్నపాలను పెడచెవిన పెట్టారు.
మెట్రో మొదటి దశ పూర్తి చేస్తే పాత నగరంలో కాంగ్రెస్ కు రాజకీయంగా పట్టు పెరుగుతుంది. శాసనసభ ఎన్నికల్లో మజ్లీస్ కు ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్ తాజా నిర్ణయంతో మరింత దూకుడుగా పాతబస్తీలో పాతుకు పోతుందని హస్తం నేతల అంచనాగా ఉంది.
ఫార్మా సిటీని మెగా టౌన్ షిప్ గా మార్చాలనే నిర్ణయం సముచితమైనదనే చెప్పవచ్చు. ఇప్పటికే నగరం ORR ధాటి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి, విమానాశ్రయానికి చేరువలో ఫార్మా సిటి క్షేమకరం కాదని దాన్ని మరింత దూరంగా తరలించాలని సిఎం ఆదేశించటం హర్షణీయం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మత్తు పదార్థాల రవాణా, వినియోగం హైదరాబాద్ లో అధికం అయింది. క్రమంగా ఇప్పుడు జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తోంది. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని మాజీ సిఎం కెసిఆర్ పలుమార్లు హుంకరించినా…ఆచరణలో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో IPS అకున్ సబర్వాల్ కు నార్కోటిక్స్ బాధ్యతలు అప్పగించినా మూడునాళ్ళ ముచ్చటగానే ముగిసింది. గత అనుభవాల దృష్ట్యా సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఆచరణలో కార్యరూపం దాల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.
-దేశవేని భాస్కర్