Thursday, November 21, 2024
HomeTrending Newsమోడీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం -రేవంత్ రెడ్డి

మోడీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం -రేవంత్ రెడ్డి

పదేళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తెలంగాణ వచ్చిన  అనేక సంస్థలను  మోడీ రద్దు చేశారని విమర్శించారు. హైదరాబాద్ కు  కొత్త  మెట్రో లైన్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని, మూసీ ప్రక్షాళన కోసం అణా పైసా నిధులు కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా మోడీ ఒప్పుకోలేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుపైన తాను మాట్లాడితే మోడీ ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారన్నారు. డిసెంబర్ లో కేసీఆర్ ను బండకేసి కొట్టి వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారన్నారు. ఆట అయిపోలేదు.. సెమీ ఫైనల్స్ గెలిచాం.. ఫైనల్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీం తలపడుతున్నాయని సిఎం అన్నారు.

తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ కెప్టెన్ , గుజరాత్ కు మోడీ, అమిత్ షా కెప్టెన్ లని… యువత తెలంగాణ టీంను  గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణలో సీట్లు రావనే భయంతో ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడని విమర్శించారు. అంతకు ముందు బాలాపూర్ రోడ్డు షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ పాలనపై దుమ్మెత్తి పోశారు.

రిజర్వేషన్లపై సిఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో బిజెపి-కాంగ్రెస్ ల మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారబోతోందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్