Saturday, November 23, 2024
HomeTrending NewsTS Police: తెలంగాణ పోలీసు శాఖలో కీలక బదిలీలు

TS Police: తెలంగాణ పోలీసు శాఖలో కీలక బదిలీలు

కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టింది. కీలకమైన పోస్టుల్లో కొత్త వారిని నియమించింది. సీనియర్ IPS అధికారి షా నవాజ్ ఖాసిం ను ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ రేంజ్ ఐజి  బాధ్యతలను షానవాజ్ కాసిం నిర్వహించారు.

హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ADG కొత్త కోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. సైబరాబాద్ సీపీగా యువ అధికారి అవినాష్ మహంతి, ట్రాఫిక్ విభాగంలో ఉన్న సుధీర్ బాబును రాచకొండ సీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలుగా ఉన్న సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, దేవేందర్ సింగ్ చౌహాన్ లను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు.

కీలకమైన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా సందీప్ sl శాందీల్యని నియమించారు. డ్రగ్స్ మహమ్మారిని ఉపేక్షించేది లేదని ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే సున్నితంగా మాట్లాడినా… చట్ట వ్యతిరేకులతో కరకుగా వ్యవహరించే సందీప్ శాండిల్యకు ఆ శాఖను అప్పగించారు.

తాజా బదిలీలతో పోలీసు ఉన్నతాధికారుల్లో సిఎం వైఖరి ఏంటో అర్థం అయింది. రెండు రోజుల్లో ఐజి నుంచి ఎస్పిల వరకు బదిలీలు జరుగుతాయని తెలిసింది. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగిన అధికారులకు కొందరికి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు.

డిజిపి రవి గుప్తను కూడా త్వరలో మార్చనున్నారని విశ్వసనీయ సమాచారం. మరో ఐదు నెలలే సర్వీస్ ఉండటం…లోకసభ ఎన్నికల సమయంలో కొత్తవారు వస్తే ఇబ్బందికరమని…ఇప్పుడే పూర్తిస్థాయి డిజిపిని నియమించాలని సిఎం యోచిస్తున్నారని తెలిసింది.

ఈ పదవుల పందేరం చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో సిఎంగా కెసిఆర్ కూడా ఈ మాదిరే సమర్థులైన అధికారులతో టీం తయారు చేసినా…రెండో దఫా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నలుగురితో నారాయణ అన్నట్టు కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

కెసిఆర్ ప్రభుత్వంలో పోలీసు శాఖలో కొంత మందికే అందలాలు దక్కాయని అపవాదు ఉంది. కావల్సిన అధికారులకు అదనపు బాధ్యతలతో అప్పగిస్తే…మరికొందరిని నెలల తరబడి వెయిటింగ్ లో ఉంచారు. పదోన్నతులు ఇచ్చినా పాత బాధ్యతల్లోనే కొనసాగించటం జరిగింది. ముఖ్యంగా SI, CI ల బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫారసులు తప్పనిసరి చేయటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం లో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలేకపోయారనేది వాస్తవం. దీంతో చట్టం కొందరికి చుట్టంలా మారిపోయిందని విమర్శలు ఉన్నాయి.

తాజా పరిణామాలను విశ్లేషిస్తే సిఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తారని పోలీసు వర్గాలు అంటున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్