Sunday, January 19, 2025
HomeTrending Newsటిడ్కో ఇల్లు త్వరగా అందించాలి: సిఎం జగన్

టిడ్కో ఇల్లు త్వరగా అందించాలి: సిఎం జగన్

Urban: కృష్ణా, గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే వాటిని కాల్వల్లోకి, నదుల్లోకి చేరేలా ప్రత్యక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలన్నారు.  పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.

 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, ఈలోగా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేయాలని కోరారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనా పనులు వేగంగా జరుగుతున్నాయని  అధికారులు సిఎంకు వివరించారు. మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, మరో రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై కూడా సిఎం ఆరా తీశారు. సంబంధించి  4396.65 కి.మీ మేర రోడ్లు నిర్మాణం కోసం 1826.22 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని, ఇప్పటికే 55.15శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జులై 15 నాటి కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తిచేస్తామని అధికారులు వివరించారు.

సీఆర్డీఏ కింద పనుల ప్రగతిపై అధికారులు సిఎంకు వివరాలు అందించారు. కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని, క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, సీడ్‌యాక్సిస్‌ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ ను పూర్తిచేసే పనులు మొదలవుతాయని అధికారులు వెల్లడించారు.

జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నామని అధికారులు వివరణ ఇవ్వగా,  పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేయాలని సూచించారు. అవి సమర్ధవంతంగా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది జీతాలు, విజయవాడలో కాల్వల సుందరీకరణ, జగనన్న హరిత నగరాలు, జగనన్న టౌన్ స్మార్ట్ టౌన్ షిప్. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలపై కూడా సిఎం సమగ్రంగా చర్చించారు.

ఈ సమీక్షా సమావేశంలో పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్