ఈ నెల 14న తిరుపతిలో జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో 8 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు… ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు సభ్యులుగాను, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీవులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పాల్గొంటాయి. ఆయా రాష్ట్రాలగవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు, ఆయా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం, వివిధ ఇతర అంశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.
సిఎం సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలుశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, స్టేట్ రీఆర్గనైజేషన్ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్ కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.