Saturday, November 23, 2024
HomeTrending Newsఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: సిఎం

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: సిఎం

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు, టిడ్కో, ఎంఐజీ ఇళ్ల నిర్మాణం, 90 రోజుల్లో ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఇళ్ళ నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలని సూచించారు. ఇళ్ళలో  ఏర్పాటు చేయబోయే విద్యుదీకరణకు సామాగ్రి పెద్ద ఎత్తున అవసరం అవుతుందని, దీనికి కావాల్సిన వస్తువులను ముందే సమకూర్చుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొదటి విడతలో 85,888 టిడ్కో ఇళ్ళ పనులు పూర్తి చేస్తున్నామని, డిసెంబర్ నాటికి వీటిని లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు సమావేశంలో తెలియజేశారు.

మరోవైపు నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అందించ తలపెట్టిన ప్లాట్ల పథకంపై కూడా సిఎం సమీక్షించారు. ఇప్పటివరకూ దాదాపు 4 లక్షల ఇళ్ళ ప్లాట్లకు డిమాండ్ వచ్చిందని అధికారులు చెప్పగా, దసరా నాటికి దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

జగనన్న కాలనీల్లో తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అర్హత ఉండి, ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తుకున్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు పంపిణీ చేయాల్సిందేనని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్