ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు నేడురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. దీనితో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా సిఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.
భావనపాడు పోర్టును మూలపాడు పోర్టుగా పేరు మార్చిన సంగతి తెలిసిందే, 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 4 బెర్తుల నిర్మాణం, జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు ఈ పోర్టు ఉపయోగపడుతుంది, 30 నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు మూలపేట పోర్టు అత్యంత కీలకంగా మారనుంది.