వైయస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాలతో మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బాటలు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధికోసం చేపడుతున్న కార్యక్రమాలను మరోసారి సమీక్షించి, వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన, చైతన్యం కల్పించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ ఆసరా, చేయూత కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన పలు సూచనలు
⦿ గత ప్రభుత్వం మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసింది
⦿ వారి మాటలు నమ్మిన అక్కచెల్లెమ్మలు రుణాలు, వడ్డీలు కూడా చెల్లించలేదు. వీటిని మన ప్రభుత్వం నాలుగు దఫాలుగా చెల్లిస్తోంది
⦿ సున్నావడ్డీ రుణాలను తిరిగి పునరుజ్జీవింపచేసి, మహిళలను ఆదుకోవడంతో పాటు వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేస్తున్నాం
⦿ ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేస్తున్నాం
⦿ పాదయాత్రలో తమ రుణాలు మాఫీ చేయాలంటూ డ్వాక్రా మహిళా సంఘాలు విజ్ఞప్తి చేశాయి
⦿ ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకు వచ్చాం
⦿ ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక భరోసా మహిళల జీవనప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి
⦿ ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్ ఇంకంబర్డ్ ఖాతాల్లో జమచేస్తున్నాం
⦿ ఇళ్ల పథకంలో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు రూ.35వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి
⦿ వైయస్సార్ ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికోసం వినియోగించుకోవాలి
⦿ సుస్థిర జీవనోపాధి మార్గాలద్వారా విజయవంతం అయిన మహిళలద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలి
⦿ మహిళలు నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణద్వారా పొందుతున్న ఆదాయ వివరాలను సాటి మహిళలకు తెలియజెప్పాలి
ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి సత్యనారాయణ, సెర్ఫ్ సీఈఓ ఏ ఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్, సెర్ఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఎం మహిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.