Saturday, January 18, 2025
HomeTrending Newsప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: సిఎం జగన్

ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: సిఎం జగన్

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త రేటు ఎక్కువైనా గుడ్డలతో తయారుచేసినవే  పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో ఇదో తొలి అడుగు అన్నారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ పై నిషేధం అమల్లో ఉందని, అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని, అన్నీ క్లాత్ బ్యాగులే వాడుతున్నారని చెప్పారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో, వారికి అవహాహన కల్పిస్తూ,  ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేస్తూ  ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించే చర్యలు చేపడతామని, 2027చివరి నాటికి ప్లాస్టిక్ కాలుష్యం లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు అడుగులు వేస్తామని వెల్లడించారు.

విశాఖ నగరంలో  పార్లే ఓషన్స్ సంస్థతో కలిసి ప్లాస్టిక్ రహిత సముద్ర తీరం కార్యక్రమం చేపట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం జగన్- పార్లే ఓషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు చాలా చోట్ల ఫ్లేక్సీలు కనబడ్డాయని,  ఎక్కువ నేనే కనబడ్డానని జగన్ చమత్కరించారు. ఇలాంటి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సమంజసం  కాదని… ఇదే విషయాన్ని కలెక్టర్ డా. మల్లిఖార్జునతో చెప్పానన్నారు. వీటిలో ఎక్కువగా గుడ్డలతో తయారు చేసివి ఉన్నాయని కలెక్టర్ చెప్పారని వివరించారు.

పార్లే సంస్థ సముద్ర తీరం నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలను  బైటకు తీస్తుందని, ఈ వ్యర్దాలతో షూస్,  గాడ్జెట్స్ తయారు చేస్తుందని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్ర జీవరాసులను హరించి వేస్తున్నాయని సిఎం జగన్ ఆవేదన వ్యక్తం చేస్తూ… ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పార్లే ఓషన్స్ రాబోయే ఆరు సంవత్సరాల్లో 16వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెట్టబోతోందని చెప్పారు. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

Also Read : త్వరలో బందరు పోర్టు పనులు:  జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్