దసరా పండుగ రోజు నుంచి విశాఖలో కార్యకలాపాలు మొదలు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సిఎంవో అక్కడినుంచే విధులు నిర్వర్తిస్తుందని స్పష్టం చేశారు. సిఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి నేడు సచివాలయంలో సమావేశమైంది. దీనిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకు ‘జగనన్న సివిల్స్ సర్వీసెస్’ పథకం అమలుకు కేబినేట్ నిర్ణయించింది. సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకం అందించనున్నారు. ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధిస్తే లక్ష రూపాయలు, మెయిన్స్ పాస్ అయితే అదనంగా మరో 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిపిఎస్ రద్దు చేసి ఆ స్థానంలో జీపీఎస్ అమలుకు మంత్రివర్గం నిర్ణయించింది.
మెయిన్ అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో సిఎం జగన్ పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అసెంబ్లీ సమావేశాలు వేదికగా గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిపై మాట్లాడాలని సూచించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వెళ్దామని సిఎం చెప్పారు.