Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆ ఊళ్ళో అనుబంధాలు వండి వడ్డిస్తారు!

ఆ ఊళ్ళో అనుబంధాలు వండి వడ్డిస్తారు!

ఒకప్పుడు ఎన్ని తరాల వారయినా ఒకే ఊళ్ళో ఉండేవారు. అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర బంధు గణంతో ఎప్పుడూ ఒంటరితనం ఉండేదికాదు. క్రమంగా చదువులు, ఉద్యోగాలంటూ పట్నాలకు, విదేశాలకు వెళ్లడం మొదలైంది. అలా వెళ్లలేని పెద్దవారు అప్పుడప్పుడు వచ్చే పిల్లలకోసం ఎదురుచూస్తూ ఊళ్ళోనే ఉంటున్నారు. అలా పెద్దవాళ్ళను వదిలేయలేక, దగ్గర ఉండలేక పిల్లలకూ ఇబ్బందే. ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువయ్యాయి అందుకే. అయితే ఒక గ్రామం ఇందుకు భిన్నం. అక్కడి వారు వృద్ధాప్యాన్ని, ఒంటరి తనాన్ని ఎదుర్కోడానికి వినూత్నమైన ఆలోచన చేశారు.

గుజరాత్ రాష్ట్రం, మెహసానా జిల్లాలో ఉంది చందంకి గ్రామం. మొత్తం జనాభా 1100. ఎక్కువ భాగం పెద్దవారే. అంతా కలుపుగోలుగా ఒకరికొకరు అన్నట్టు ఉంటారు. ఎవరింట్లోనూ పొయ్యి లేవదు.గిన్నెల చప్పుళ్ళు ఉండవు. అయినా ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం ఊరంతా ఘుమఘుమలు వ్యాపిస్తాయి. వారంతా కలసి నిర్మించుకున్న కమ్యూనిటీ కిచెన్ ఇందుకు వేదిక.

పాత కొత్తల మేలు కలయికతో నిర్మించిన సౌరశక్తితో నడిచే ఏసీ హాలులో గ్రామస్తులంతా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు.ముందుగా మహిళలు, తర్వాత పురుషులు తింటారు. కమ్మటి దాల్ , వేడి వేడి రోటీలు, కూరలు ఆ పెద్దవారి ఉదరాలతో పాటు మనసునీ శాంతించేలా చేస్తాయి. అతిథులకూ అంతే ఆదరం లభిస్తుంది.

గత పదేళ్లుగా ఈ కమ్యూనిటీ కిచెన్ పెద్దవారికి, ఆరోగ్య సమస్యలున్న మహిళలకు అండగా నిలబడింది . ఆకలితీర్చడమే కాదు, ఒంటరితనాన్నీ పోగొడుతోంది. పిల్లలు ఉద్యోగ అన్వేషణ లో నగరాలకు వెళ్లగా , ఈ సామూహిక వంటశాల ఆధారంగా నిలబడింది.

వినూత్నమైన చందంకి గ్రామం ఆలోచన సామాజిక సంబంధాలు, సహకారానికి నిదర్శనంగా నిలిచింది. వంట అంటే కేవలం మంట,గిన్నెలు కాదని , అనుబంధాలు బలోపేతమయ్యే చోటు అని నిరూపించింది. చందంకి గ్రామ స్ఫూర్తి మరెన్నో గ్రామాలకు కావాలి దీప్తి. అది తక్షణ అవసరం కూడా.

-కె.శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular