Sunday, February 23, 2025
HomeTrending Newsమతం పేరుతో రాజకీయాలు...బడాబాబులకు మాఫీలు - కేటిఆర్ విమర్శ

మతం పేరుతో రాజకీయాలు…బడాబాబులకు మాఫీలు – కేటిఆర్ విమర్శ

నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. కానీ… ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి… ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్… కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఉందని, అలాంటి ప్రాజెక్ట్ లో  చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దం పెట్టి వెతికి… అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ఓర్వలేక కాళేశ్వరం పై ఏడుస్తున్నారని విమర్శించారు.

8 ఏళ్లలో ఏం చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు రాబోయే శతాబ్దం వరకు మంచి నీటిని అందించే ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. రాబోయే రోజుల్లో మీరే ఈ వార్తను అంగీకరిస్తారన్నారు. ఇంటింటికి నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ విషయం చెప్పింది కేంద్ర జల శక్తి మిషన్…కానీ ఆ శాఖ మంత్రే ఇక్కడకు వచ్చి తిడుతారు అది వేరే విషయం అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో కొందరు మతం పేరిట రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడని, మతం పేరుతో… దేవుడి పేరుతో.. కొట్లాటలు చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నా దృష్టిలో మా అమ్మ నా దేవత అన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ ని మాఫీ చేయొచ్చట కానీ… పేదలకు 2, 3 లక్షలు పెట్టి పెన్షన్లు ఇవ్వొద్దని కొందరు నీతులు చెపుతున్నారని విమర్శించారు. ఉచితాలు అని మాట్లాడుతున్నారు.. 400 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు ఎందుకు అయ్యింది అంటే మాత్రం నోరు ఎత్తరని కేటిఆర్ మండిపడ్డారు.

తెలంగాణలో ఉన్న 46 వేల చెరువులన్నింటినీ బాగుచేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పారు. కులమతాలను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లకు చేరిందన్నారు.
టీహబ్‌, వీహబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి తెలిపారు. అందుకే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్