లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బిజెపిలో అయోమయం నెలకొంది. ఎన్నికల తంతు పూర్తి కావచ్చి మూడు నెలలు గడించింది. శాసనసభ రెండోసారి సమావేశం అవుతోంది. ఇప్పటివరకు బిజెపి శాసనసభ పక్ష నాయకుడి ఎంపిక జరగలేదు.
దీంతో సభలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలియని అయోమయం నెలకొంది. బీఏసి సమావేశాలకు పార్టీ తరపున ఎవరు హాజరు కావాలో తెలియక ఎమ్మెల్యేలు తికమకపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సభలో పార్టీ తరపున అనుసరించాల్సిన విధానాలపై కూడా స్పష్టత ఇవ్వలేదని వినికిడి. ఒకరిద్దరు మినహా అందరు ఇతర పార్టీల నుంచి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరికి బిజెపి విధానాలు అర్థమై పార్టీ లైన్ లోకి వచ్చేసరికి ఏడాది గడిచేట్టుగా ఉంది.
ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేల్లో BJLP నేతగా ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశం ఇంతవరకు కొలిక్కి రాలేదు. సినియారిటి దృష్ట్యా మూడోసారి గెలిచిన రాజా సింగ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. గత సభలో BJLP నేతగా రాజాసింగ్ ఉన్నారు.
రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకుర్చాయని కొద్ది రోజులు సస్పెండ్ చేయటం.. ఎన్నికల సమయంలో ఎత్తేసి తిరిగి పార్టీ టికెట్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో అన్ని అంశాలపై రాజ సింగ్ మాట్లాడలేరనే చర్చ పార్టీలో జరుగుతోంది. కరడు గట్టిన హిందువాదిగా రాజా సింగ్ కు శాసనసభ పక్ష నేతగా ఇవ్వాలని పార్టీలోని ఓ వర్గం పట్టు బడుతోంది.
అగ్రనేతల పరంగా చూస్తే బండి సంజయ్, ఈటెల రాజేందర్.. రాజ సింగ్ కు బలమైన మద్దతుదారులు. సస్పెన్షన్ ఎత్తివేతలో బండి సంజయ్ చొరవ తీసుకున్నారని… వ్యతిరేకించే వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని అంటారు. నేరుగా వ్యతిరేకించకున్నా.. నర్మ గర్భంగా ఎవరికీ ఇచ్చినా పరవాలేదని ఢిల్లీ పెద్దల సమక్షంలో చెపుతున్నట్టు వినికిడి.
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన కాంగ్రెస్ లైన్ లో అధికంగా ఉంటారని పేరుంది. మహేశ్వర్ రెడ్డికి ఇస్తే శాసనసభలో పార్టీ పరపతి సంగతి దేవుడెరుగు ఆయన వ్యక్తిగత పరపతి పెంచుకునేందుకు వినియోగించుకుంటారని పార్టీ పెద్దలకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయని తెలిసింది.
ఇక మిగిలిన వారిలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మొదటిసారి గెలిచారు. అయితేనేం ప్రజా సమస్యల పట్ల క్లారిటీ ఉంది. ఏ అంశంపైనైనా సూటిగా మాట్లాడగలరని.. పార్టీ విధానాలను బలంగా వినిపించగలరని పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు ముక్తకంఠంతో మద్దతు ఇస్తున్నారు.
అయితే బిజెపిలో పాతుకుపోయిన హైదరాబాద్ నేతలు పట్నం అవతల వారికి నాయకత్వ బాద్యతలు ఇస్తే ఎలా ఉంటాయో గతంలో CH విద్యాసాగర రావు.. ఇటీవల బండి సంజయ్ ల ద్వారా చూశారు. ఇక మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడని.. భాగ్యనగర్ కమలం త్రయం యోచిస్తోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా తలమునకలుగా ఉన్న ఢిల్లీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారని… త్వరలోనే BJLP చిక్కుముడి వీడనుందని కమలం నేతలు అంటున్నారు.
-దేశవేని భాస్కర్