దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ సతీమణి విజయమ్మ ఆయన సమాధిపై పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కూడా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
మరోవైపు హైదరాబాద్ పంజాగుట్టలోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మాజీ ఎంపి కేవీపీ రామచంద్రరావు, పలువురు మంత్రులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం నాంపల్లి గాంధీ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశ పట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఓ దిక్సూచిగా నిలుస్తున్నాయని కొనియాడారు.