Thursday, September 19, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బిజెపిలకు నష్టం.. లబ్ది పొందని గులాబీ

కాంగ్రెస్, బిజెపిలకు నష్టం.. లబ్ది పొందని గులాబీ

ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేసిన తప్పిదాలతో రెండు పార్టీలు నష్టపోతున్నాయి. అయితే ఆ నష్టం నుంచి బీఆర్ఎస్ కు లాభం జరగకపోగా గులాబీ దళానికి ఉహించని షాక్ తగలబోతుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు లోక్ సభ టికెట్ ఇవ్వటంతో బిజెపి, కాంగ్రెస్ చెరో రెండు మూడు స్థానాల్లో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. వరంగల్ నుంచి అరురి రమేష్ కు టికెట్ ఇవ్వటంతో బిజెపి చివరి వరకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చి తప్పు చేశామని పార్టీ పెద్దలే అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు. ఆదిలాబాద్ లో గోడం నగేష్ కు ఇవ్వటంపై ఇదే రీతిలో టాక్ వచ్చినా మహారాష్ట్ర సరిహద్దు కావటంతో బిజెపి, ప్రధాని మోడీ చరిష్మాతో బయట పడతామని కమలం నేతలు భరోసాతో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే చేవెళ్ళ, మల్కజ్ గిరి, వరంగల్, సికంద్రాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై నామినేషన్ నాటి నుంచే పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత కనిపించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వటంతో ఓటర్లు పెదవి విరిచారని సమాచారం ఉంది. ముఖ్యంగా చేవెళ్ళలో పట్టున్న సునితా మహేందర్ రెడ్డిని మల్కజ్ గిరికి పంపటం…బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వటంపై కాంగ్రెస్ లో భారీ చర్చే జరుగుతోంది.

మల్కజ్ గిరిలో ఈటల రాజేందర్ కు సాయం చేసేందుకే సిఎం రేవంత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డిని పంపారని… ఈటెల మంత్రాంగంతోనే రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారని పుకార్లు షికారు చేస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలకు రంజిత్ రెడ్డి భారీ ఎత్తున దక్షిణ సమర్పించారని కాంగ్రెస్ లో టాక్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో జరిగిందా.. సిఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమా త్వరలోనే తెలుస్తుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ లకు ఎవరికీ టికెట్ ఇచ్చినా సికంద్రాబాద్ లో పోటీ బలంగా ఉండేదని చర్చ జరుగుతోంది. అంగ, అర్థ బలం చూసి దానం నాగేందర్ ను ఎంపిక చేసినా అంతగా పోటీ ఇవ్వలేకపోయారని అంటున్నారు. ముస్లిం, క్రైస్తవ మైనారిటీల ఓట్లను కాంగ్రెస్ నమ్ముకుంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బయట పడతారని అంటున్నారు.

వరంగల్ స్థానంలో చివరి నిమిషంలో కడియం కావ్యను బరిలోకి దించగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు అంతగా సహకరించలేదని అంటున్నారు. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావటంతో ఓటర్ల పరిస్థితి మరో రకంగా ఉంది. అభ్యర్థుల గురించి ఆరా తీస్తే ఏ రాయితో బాదుకున్నా ఒకటే అన్న రీతిలో వోటర్లు నిస్తేజంగా జవాబిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో సామాన్యుడికి అంతుపట్టని స్థాయిలో జరిగినట్టు కనిపిస్తోంది. పార్టీల తీరు.. నేతల వైఖరి చూస్తుంటే కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. పార్టీల మధ్య విబేదాలు… నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నా ఎక్కడో అంతర్గత ఒప్పందాలు… అవగాహన జరిగిందని రాజకీయ విశ్లేషకులు అనుమాన పడుతున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు స్వయంకృత అపరాదామా.. నేతల మధ్య అంతర్గత ఒప్పందాల అనేది తొందరలోనే తేలనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్