రాష్టంలో ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. నేడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కారదర్శి కె. రామకృష్ణతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రాష్టంలో కూడా కలిసి ముందుకువెళ్లాలని, ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలని నేతలు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
కాగా, ఎన్నికల శంఖారావం పేరుతో ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి తో సహా పలువురు జాతీయ నేతలు ఈ సభకు హారజవుతున్నారు. రాష్ట్రానికి చెందిన లెఫ్ట్ పార్టీల నేతలను ఈ సభకు షర్మిల ఆహ్వానించారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చి ఉండేదని షర్మిల వ్యాఖ్యానించారు. తమకు అధికారం అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలువంచి హోదా సాధిస్తామన్న సిఎం జగన్ కనీసం ఒక్క పోరాటం కూడా చేయలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు. హోదా ఇవ్వకపోవడంవల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని, సిఎం కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శించారు. నిన్న తాము చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని…. ఒక రాత్రి అంతా పార్టీ ఆఫీస్ లోనే ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.
షర్మిల అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వామపక్ష నేతలు తప్పుబట్టారు.