Monday, November 25, 2024
HomeTrending Newsతుక్కుగూడ నుంచే కాంగ్రెస్ జంగ్ సైరన్

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ జంగ్ సైరన్

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్… న‌రేంద్ర మోడి నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఈ క్ర‌మంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గ‌డ్డ‌మీద‌, అదీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించిన తుక్కుగూడ వేదిక‌గానే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఈ నెల 6వ తేదీన తుక్కుగూడ‌లోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జ‌న‌ జాత‌ర పేరిట నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో నేషనల్ మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌నున్న అయిదు గ్యారంటీల‌ను కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించ‌నుంది.

తుక్కుగూడ‌లోని 60 ఎక‌రాల విశాల‌మైన మైదానంలో జ‌న జాత‌ర బ‌హిరంగ స‌భ‌ను కాంగ్రెస్ నిర్వ‌హించ‌నుంది. మైదానం ప‌క్క‌నే వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 300 ఎక‌రాల స్థ‌లం అందుబాటులో ఉంది. జ‌న‌జాత‌ర స‌భ‌కు ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు అన్నిగ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల నుంచి అభిమానులు వస్తారని… ప్ర‌జ‌ల స్పంద‌న ఆధారంగా క‌నీసం ప‌ది ల‌క్ష‌ల మంది జ‌న‌జాత‌ర‌కు హాజ‌రవుతార‌ని కాంగ్రెస్ అంచ‌నా వేస్తోంది.

శాసన‌స‌భ ఎన్నిక‌ల‌కు తుక్కుగూడ నుంచే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ స‌మ‌ర‌శంఖం పూరించింది. తెలంగాణ విలీన దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సెప్టెంబ‌రు 17న తుక్కుగూడ‌లో విజ‌య‌భేరి పేరిట భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. విజ‌య‌భేరి వేదిక మీద నుంచే సోనియ‌గాంధీ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించారు. ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన‌డంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం కొలువుదీరింది. త‌మ‌కు క‌లిసివ‌చ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌స‌భ ఎన్నిక‌లకు స‌మ‌రశంఖం పూరించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీల హామీ ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లిన‌ట్లుగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇచ్చే అయిదు గ్యారెంటీలు దేశంలోని అన్ని వ‌ర్గాల్లోకి వెళుతాయ‌ని కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం న‌మ్ముతోంది.

తుక్కుగూడ వేదిక‌గానే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు దీరుతుంద‌ని, జూన్ 9వ తేదీన ఎర్ర‌కోటపై జెండా ఎగుర‌వేస్తామ‌ని తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేయ‌డంతో పాటు నిజ‌మ‌వ‌డంతో ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్