Saturday, January 18, 2025
HomeTrending Newsగురువారం ఆఖరు.. తేలని కాంగ్రెస్ అభ్యర్థులు

గురువారం ఆఖరు.. తేలని కాంగ్రెస్ అభ్యర్థులు

కాంగ్రెస్ పార్టీని పాత కాలం జాడ్యం వీడటం లేదు. చివరి నిమిషం వరకు తేల్చకపోవటం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా వస్తోంది. లోక్ సభ ఎన్నికల నామినేషన్ గడువు (రేపటితో -25వ తేది) దగ్గరికి వస్తున్నా ఇప్పటివరకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు ఢిల్లీ, బెంగళూరు, కేరళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కరీంనగర్ లో అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించకపోయినా వెలిచాల రాజేందర్ రావు ప్రచారంలో నిమగ్నం అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేస్తున్నారు. మంత్రి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వెలిచాల వెంట ఉంటున్నారు. పార్టీ నేతలకు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల అని చెపుతున్న నేతలు అధికారికంగా ఎందుకు ప్రకటించటం లేదో అంతుపట్టడం లేదు.

మంత్రి పొన్నం దగ్గర ఉండి మరి నామినేషన్ దాఖలు చేయించారు. హస్తం నేతలను అయోమయానికి గురిచేస్తున్న ఈ అంశంపై వివరణ ఇచ్చిన పొన్నం… పార్టీ పెద్దల అనుమతితోనే వెలిచాల నామినేషన్ దాఖలు చేశారని, ఈ రోజు అధికారికంగా ప్రకటన వస్తుందని వెల్లడించారు.

ఖమ్మంతో కరీంనగర్ లింకు ఉందని గాంధిభవన్ లో మీడియాకు లీకులు ఇచ్చే నేతలు చెపుతున్నారు. అసలు కరీంనగర్, ఖమ్మం సీట్లకు పోలికే లేదని… నిజానికి రెండు ప్రాంతాల్లో బిసిలకు ఇవ్వాల్సిన సీట్లను అగ్రవర్ణాలకు అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకు పొంతన లేని పోలికలు పెట్టడం పార్టీలకు అలవాటుగా మారిందని బిసి సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డికి ఉన్నా పొన్నం పట్టుదలతోనే వెలిచాలకు ఇస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రవీణ్ రెడ్డి గెలిస్తే హుస్నాబాద్ లో పక్కలో బల్లెంలా మారుతారనే ఆయనకు రాకుండా అడ్డుకున్నారని కరీంనగర్ నేతలు అనుకుంటున్నారు. మంత్రిగా ఉన్న పొన్నం ఎంపి అభ్యర్థిగా బిసి నేత ప్రతిపాదన చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి.

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బిసి ఓటర్లు చైతన్యవంతులు… వినోద్ కుమార్ ఎంపిగా ఉన్నపుడు ఆయన ఒంటెత్తు పోకడలు భరించలేకనే బండి సంజయ్ ని గెలిపించారని టాక్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ బలవంతంగా రుద్దుతున్న వెలిచాల రాజేందర్ రావు పరిస్థితి ఏంటో కొద్ది రోజుల్లో తేలనుంది.

బండి సంజయ్ అంటే సిఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని హస్తం నేతల అంతర్గత సంభాషణల్లో తెలిసింది. కెసిఆర్ హయంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినపుడు ఆయనకు మద్దతుగా బండి సంజయ్ రెండు మూడుసార్లు మాట్లాడారు. దాంతో సిఎం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దానికి తోడు ఆన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం కరీంనగర్ సీటు గెలుచుకు రాకపోతే ఆయనకు ఉండే కష్టాలు ఆయనకు ఉన్నాయని వినికిడి.

హైదరాబాద్ లో ఎప్పటి మాదిరిగానే నామమాత్రంగా సమీరుల్లాఖాన్ అనే అభ్యర్థిని కాంగ్రెస్ తరపున నిలబెడుతున్నారు. నాంపల్లిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కు టికెట్ ఇస్తే పోటీ బలంగా ఉంటుందని తెలిసినా అధిష్టానం కిమ్మనటం లేదు. కాంగ్రెస్ – ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయని చర్చలు జరుగుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డికి పట్టుపట్టి నిజామాబాదు ఎంపి టికెట్ ఇచ్చారు. ఎంఐఎం అక్రమాలపై మొదటే నుంచి గళం విప్పుతున్న ఫిరోజ్ ఖాన్ ను కాంగ్రెస్ ప్రోత్సహించక పోవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఖమ్మం టికెట్ పై మంతనాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జిల్లా నేతల మధ్య పోటీ ఏ స్థాయికి వెళ్లిందంటే వైరి వర్గం వారికి వస్తే ఎవరెంత మనఃస్పూర్తిగా చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా మళ్ళీ ప్రియాంక గాంధి పేరు తెరమీదకు వచ్చింది. గాంధి కుటుంబం సీటు రాయిబరేలితో పాటు ఖమ్మంలో పోటీ చేయించాలని రాష్ట్ర నేతలు ప్రతిపాదన చేస్తున్నారు. అదే జరిగితే నిజంగా కాంగ్రెస్ ను ఖమ్మం ప్రజలు ఆదరిస్తారా వేచిచూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్