Saturday, November 23, 2024
HomeTrending Newsఅసెంబ్లీ 20 రోజులు జరుపాలి - భ‌ట్టి విక్ర‌మార్క‌

అసెంబ్లీ 20 రోజులు జరుపాలి – భ‌ట్టి విక్ర‌మార్క‌

వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు అన్ని చర్చించే విధంగా దాదాపుగా 20 రోజుల‌కు పైగా నిర్వ‌హించాల‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని రోజులు అసెంబ్లీ న‌డుప‌మంటే అన్ని రోజులు న‌డుపుతామ‌ని ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం త‌న ఎజెండా పూర్తి కాగానే అర్థాంత‌రంగా వాయిదా వేస్తూ వ‌స్తోన్న విష‌యాన్ని మ‌నం చూస్తున్న‌మాన్నారు. గ‌త స‌మావేశాల మాదిరిగా కాకుండా ఈ సారి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రిగే విధంగా స‌మ‌యం కేటాయించాల‌ని కోరారు. మొద‌ట్లో నెల‌లో వారం రోజుల పాటు అని, ఆత‌రువాత సంవ‌త్స‌రం క‌నీసం 60 రోజులు నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆమాట నిలుపుకోలేద‌న్నారు. 8సంవ‌త్స‌రాల ప్ర‌భుత్వం ఆదాయం తెచ్చిన అప్పుల‌తో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గోదావ‌రి వ‌ర‌ద ముంపున‌కు గురి అయితే చూడ‌టానికి వెళ్లిన సీఎల్పీ బృందాన్ని ఆగ‌ష్టు 17న భూపాల‌ప‌ల్లిలో పోలీసుల‌తో ఆరెస్ట్ చేయించి అడ్డుకున్న‌ద‌న్నారు. ప్ర‌జ‌ల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును ప్ర‌జ‌లు చూడ‌కుండ అడ్డుకోవ‌డం ఎంత వ‌రకు స‌మంజ‌స‌మ‌న్నారు. సీఎల్పీ బృందం కాలేశ్వరం సందర్శనకు వెళ్ళిన రోజు కాలేశ్వరంలో 144 సెక్షన్ విధించార‌ని, కాలేశ్వరం ఏమైనా కల్లోలిత ప్రాంతమా? రహస్య ప్రాంతమా? ఎందుకు అక్కడ పోలీసుల నిర్బంధం? ఎందుకు 144 సెక్షన్ విధించారు? సీఎల్పీ బృందం కాలేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాల‌ని ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌న్నారు.

అకాల వర్షాలు, గోదావరి వరద బీభత్సం, కాలేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్, కడెం ప్రాజెక్టు వరద నీరుతో దాదాపుగా 15 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు రైతు సంఘాలు ఆందోల‌న చేశాయ‌న్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు దిగకపోవడంతో దిగువకు వెళ్లిన వరద నీటితో పంట పొలాలు నీటి మునగడంతో పాటు ఇసుక మేట వేసి రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించి పంట నష్టం అంచనా వేయించి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ సర్కారు పట్టించుకోలేద‌ని, దీనిపై ప్రభుత్వాన్ని అడుగుతామ‌ని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో 43 రోజులుగా స‌మ్మె చేస్తున్న వీఆర్ ఏ స‌మ‌స్య‌లు, పాఠ‌శాల విధ్య‌, ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు, కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్లు విక‌టించి ఇబ్ర‌హీంప‌ట్నంలో న‌లుగురు మ‌హిళ‌లు మృతి చెంద‌డం, బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల‌తో పాటు ప్ర‌భుత్వ హ‌స్ట‌ల్స్‌, గురుకుల క‌ళ‌శాల‌లు, పాఠ‌శాల‌ల్లో పురుగుల అన్నం తిని విద్యార్థులు ఆస్వ‌స్థ‌త‌కు గురైనార‌ని, ప్ర‌స్తుతం విష జ్వ‌రాల‌తో బాధ‌ప‌డుతుండ‌గా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రిని ఎండ‌గ‌డుతామ‌ని చెప్పారు. రైతు రుణ‌మాఫీ, నిరుద్యోగ నోటిఫికేష‌న్‌, నిరుద్యోగ భృతి, ఇండ్లు ,ధ‌ర‌ణి, బ‌ల‌వంత భూ సేక‌ర‌ణ‌, కృష్ణా న‌దిపై నిర్మించే ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌కుండ ప్ర‌భుత్వం ప్ర‌ధ‌ర్శిస్తున్న వివ‌క్ష‌త త‌దిత‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌న్నింటిని ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ శాస‌న స‌భ ప‌క్షం ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంద‌ని చెప్పారు.

సెప్టెంబర్ 17ను రాజ‌కీయం చేస్తుండ్రు
నిజాం రాచ‌రికం నుంచి తెలంగాణ‌కు 1948 సెప్టెంబ‌ర్ 17న స్వాతంత్రం వ‌చ్చిన రోజు అన్నారు. కానీ తెలంగాణ విమోచ‌న రోజు అని బిజెపి, వీలీన రోజు అని మ‌రి కొంద‌రు, విద్రోహ‌దిన‌మని ఇంకొంద‌రు అన‌డం స‌రికాద‌న్నారు. సెప్టెంబ‌ర్ 17 తెలంగాణ‌కు స్వాతంత్రం వ‌చ్చిన రోజుగా ప‌రిగ‌ణించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏడాది మొత్తం వ‌జ్రోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని, ఆనాటి పోరాటాల‌ను నేటి త‌రానికి చాటి చెప్పాల‌న్నారు. కానీ బిజెపి సెప్టెంబ‌ర్ 17 రోజుకు మ‌తం రంగు పూసి మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొట్టి రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోలం లేపి ర‌క్త‌పాతం సృస్టించి రాజ‌కీయ ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. నిజాం రాజు నుంచి తెలంగాణ‌కు స్వాతంత్రం తీసుకొచ్చిన ఉద్య‌మంలో బిజెపి, టీఆర్ ఎస్ పాత్ర ఏమున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు చేసిన పోరాటం వ‌ల్ల తెలంగాణ‌కు స్వాతంత్రం వ‌స్తే దీనిని తామే తీసుకొచ్చామ‌న్న‌ట్టుగా నిన్న మొన్న పుట్టిన టీఆర్ ఎస్‌, బిజెపిలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉంద‌న్నారు. సెప్టెంబ‌ర్ 17 రోజును రాజకీయాలకోసం టీఆరెస్, బిజెపి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌దే విజ‌యం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తుంద‌ని దీమా వ్య‌క్తం చేశారు. రెండు సార్లు టీఆర్ ఎస్‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ఆ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల వ్య‌తిరేక‌త‌తో పాటు ఆసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని, ఈసారి ప్ర‌జ‌లే కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్ట‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ రెండ‌వ స్థానంలో ఉన్న‌ద‌ని సీఎం కేసీఆర్ అన‌డం హ‌స్య‌స్ప‌దంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ మొద‌టి స్థానంలో ఉన్న‌ద‌ని, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో గెలిచేది కూడ కాంగ్రెస్ పార్టీనేన‌ని, టీఆర్ ఎస్ రెండ‌వ స్థానంలో ఉంటుంద‌ని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు.

పాద‌యాత్ర‌కు వెళ్ల‌లేక‌పోతున్నా..
భారత్ జోడో యాత్ర ద్వారా జాతిని ఏకం చేయడానిని కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధి క‌న్య‌కూమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు ఈనెల 7 నుంచి పాదయాత్ర చేస్తున్నార‌ని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా కన్యాకుమారి వద్ద ప్రారంభమయ్యే పాద‌యాత్రలో తాను పాల్గొనలేక పోతున్నానని చెప్పారు.
దేశ స‌మైఖ్య‌త‌, స‌మ‌గ్ర‌త కొర‌కు రాహుల్ గాంధి చేప‌ట్టిన పాద‌యాత్రలో అందరు పాల్గొనాల‌ని పిలుపు నిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్