Wednesday, December 18, 2024
HomeTrending Newsతెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ దీన్ని విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ స్థాయి ఎన్నికలకు ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందిరమ్మ రాజ్యం…. ఇంటింటా సౌభాగ్యం’ పేరిట విడుదల చేయగా ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని అంశాలను మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. మేనిఫెస్టోలో 33 అంశాలు చేర్చామని… కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. క్రీడలను ప్రోత్సహిస్తామని, కొత్తగా విశ్వవిద్యాలయాలు తీసుకొస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు.

మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా,

హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు.

భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకలపాడులను తిరిగి తెలంగాణాలో విలీనం.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తామని మేనిఫెస్టోలో వివరించారు.

రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు.

హైదరాబాద్- బెంగళూరు మధ్య IT, ఇండస్ట్రియల్ కారిడార్ , హైదరాబాద్ – నాగపూర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు,

హైదరాబాద్‌కు యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తాము వచ్చాక ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కొత్తగా సైనిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం, డ్రై పోర్టు వంటి హామీలు ఇచ్చింది.

జాతీయ, రాష్ట్ర మేనిఫెస్టోలను ఉపయోగించి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయనుంది. ఈ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని పార్టీ ఆదేశించింది.

కాంగ్రెస్ హామీలు ఘనంగా ఉన్నా ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయగలవని చర్చ జరుగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఆచరణలోకి రావలిసినవి ఇంకా బాకీ ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే చేయబోయే మరిన్ని కార్యక్రమాలను ప్రకటించటం గమనార్హం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్