ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం గర్హనీయమన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను మంత్రి హైదరాబాద్ లో తీవ్రంగా ఖండించారు. మానవత్వంతో పనిచేయడానికి, సేవచేయడానికి కులాలు, మతాలు, ఎల్లలు ఉండవు. అదే సమయంలో దుర్మార్గాలు చేసే వారికి కూడా కులాలు, మతాలు, ఎల్లలు ఉండవన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం గావించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు. పాలమూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా ఆ వాతావరణం కలుషితం కావద్దని, దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.