ఐదేళ్లుగా అందిస్తోన్న సుపరిపాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తూ…. పార్టీ కోసం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
“నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీ యువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా జగన్ ఈనెల 17నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్, ఈ నెల 17 నుంచి జూన్ 1 వ తేదీ వరకూ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల క్రితం విచారణ జరిపి తీర్పును నేటికి రిజర్వ్ చేసిన కోర్టు నేడు టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.