Cordial Meeting Between Ap Odisha Chief Minister At Bhuvaneshwar :
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రదేశ్, ఓడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు భువనేశ్వర్ లో ఓడిశా సిఎం నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. వీరి సమావేశంపై ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తారని, రెండు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ కమిటి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సిఎంల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, చర్చలు ఫలప్రదంగా ముగిశాయని ప్రకటనలో పేర్కొన్నారు. రెండూ సరిహద్దు రాష్ట్రాలే కాకుండా చారిత్రక, వారసత్వ సంబంధాలు కలిగి ఉన్నాయని, అవసరమైన సమయాల్లో రెండు రాష్ట్రాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయని తెలిపారు.
నీటిపారుదల, సరిహద్దు సమస్యలు, వామపక్ష తీవ్రవాదం లాంటి అంశాలతో పాటు కోటియా గ్రామాలు, నేరడి బ్యారేజ్, జంఝావతి రిజర్వాయర్, పోలవరం, బహుదా రివర్, బలిమెల, అప్పర్ సీలేరు విద్యుత్ అంశాలు సిఎంల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు వెల్లడించారు. శ్రీకాకుళంలోని బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఒడియా, బరంపురం యూనివర్సిటీలో తెలుగు భాషాభివృద్ధికోసం పీఠాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సరిహద్దు గ్రామాల్లో సోదరభావాన్ని పెంపొందించేలా అక్కడి పాఠశాలల్లో ఒడియా, తెలుగు భాషా టీచర్లను నియమించాలని, రెండు భాషల పుస్తకాలను పంపిణీ చేయాలన్న ప్రతిపాదనకు అంగీకారం కుదిరింది.
Must Read : నేడే ఏపీ- ఓడిశా సిఎంల భేటి