కరోన విజృంభణ మళ్ళీ మొదలైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు చిల్వాకోడుర్, వెనుగుమట్ల గ్రామాల్లో లెక్కకు మించిన కేసులు వస్తున్నాయి. వెనుగుమట్ల గ్రామంలో 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. దీంతో గ్రామంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చిల్వాకోడుర్ లో కూడా ఇదే స్థాయిలో కేసులు వస్తున్నాయి. కరోనతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరో ఐదుగురు ఉపాధ్యాయులకు కూడా సోకినట్టు సమాచారం. ఇటీవల చిల్వకోడూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఉపాధ్యాయులు ప్రతి రోజు కరీంనగర్ నుంచి విధులకు వస్తున్నారు. కరీంనగర్ లో ఇటీవల ఒకే రోజు 50 పై చిలుకు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ నుండి వచ్చేవారి వల్లే గొల్లపల్లి మండలానికి మహమ్మారి వ్యాపించినట్టు వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి.
మూడు రోజులుగా గొల్లపల్లి మండలంలో కేసులు పెరుగుతున్నా అధికార వర్గాలు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవలే జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల లో ఒకే రోజు 100 కరోన టెస్టులు చేయగా 32 కేసులు పాజిటివ్ వచ్చాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలలో ఎక్కువ మంది పోగు కావటం వల్లే కొత్తగా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.