Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవరదలో బురదోత్సవం!

వరదలో బురదోత్సవం!

ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా.

ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్ కొన్నా. అయిదేళ్ల వారెంటీ. పదేళ్ల గ్యారెంటీ. అద్భుతంగా పని చేస్తోంది. తక్కువ సౌండ్. ఎక్కువ పని. ఎక్కువ కాలం మన్నిక. ఆటోమేటిక్. తెడ్లతో పని లేదు. ఏకకాలంలో పది మంది కూర్చోవచ్చు. నువ్వూ అదే కొను.

నిజమే భీమయ్యా! అమెరికాలో ఉన్న మా అబ్బాయి, అమ్మాయి, మనవళ్లు, మనవరాళ్లు వర్షాకాలానికి ముందే మంచి బోటు కొనుక్కోమని వాట్సాప్ వీడియో కాల్లో చెబుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాను. ఇక లాభం లేదు. వెంటనే కొనాలి. ఎంతయ్యింది నీ బోటు?

ఎంత రామయ్యా! ముష్టి పది లక్షలు. అంతే. మనం విల్లాకు అయిదు కోట్లు పెట్టాం. విల్లా ఇంటీరియర్ కు రెండు కోట్లు పెట్టాం. ఇప్పుడు మార్కెట్లో మన విల్లా విలువ పదిహేను కోట్లకు పైనే…బోటున్న విల్లాలకు ఇంకా రేటు ఎక్కువ కూడా ఉంటుందని మా అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్లో చెప్పాడు. కార్ పార్కింగ్ తో పాటు ప్రతి ఇంటి ముందు బోటు కట్టుకునే జెట్టీ కూడా మన విల్లా అసోసియేషన్ కట్టిస్తుందట కదా! ఇంకెందుకు ఆలస్యం? త్వరగా కొను!

నిజమే భీమయ్యా! ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది. చిన్నప్పుడు మాయాబజార్లో లాహిరి…లాహిరి…పాటలో చూసినప్పటినుండి అలా నేనూ మా ఆవిడ పడవలో తిరగాలని కలలు కనేవాడిని. ఇన్నేళ్లకు ఈ విల్లాలు ఇలా నీళ్లల్లో మునగడంవల్ల నా కోరిక తీరుతోంది.

అంతే రామయ్యా!
నిండా మునిగినవాడికి చలి ఏమిటి?

పీకల్లోతు కష్టాల్లో ఉన్నా…మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం నీ సామెతలే భీమయ్యా!

రామయ్యా! నాలుగు రోజులుగా కరెంటు లేదు. జనరేటర్ లేదు. ఎలా ఉంటున్నారు? ఏమి తింటున్నారు?

ట్రిప్లెక్స్ హౌసులు కదా మనవి! మునిగింది గ్రవుండ్ ఫ్లోరేగా! మిగతా రెండు ఫ్లోర్లలో ఉంటున్నాం. వేళకు అమెరికా నుండి మా మనవడు స్విగ్గిలో ఆర్డర్ ఇస్తున్నాడు. వాడు డ్రోన్లో ఫుడ్ డెలివరీ మా విల్లా మీద పొట్లాలు పడేస్తున్నాడు. జొమాటోవాడైతే బోటులో వచ్చి ఆహారం పొట్లాలు ఇచ్చి వెళుతున్నాడు. మా చిన్నప్పుడు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం హెలిక్యాప్టర్లలో ఆహారం పొట్లాలు జారవిడిచేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అన్నిటికీ యాప్ లున్నాయి!

మరచిపోయా రామయ్యా! ఈరోజు సాయంత్రమేమో కాంతారా సినిమాలో బురదలో దున్నపోతుల పరుగు పందేలు పెట్టిన రిషబ్ శెట్టిలా మన విల్లా పిల్లలు బురదలో ఏవో ఆటలు పెట్టుకున్నారు. రాత్రికేమో విల్లా అసోసియేషన్ వారు వెన్నెల్లో బోటు విహారం పెట్టారు. మొత్తం కమ్యూనిటీ అంతా బోట్లలో తిరుగుతూ ఉంటుంది. సందడి సందడిగా ఉంటుంది. మొన్ననే తెలుగు భాషా దినోత్సవమయ్యిందని ఈ కార్యక్రమానికి తెలుగు పేరే పెట్టారు రామయ్యా! నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి!

ఏమి పేరు పెట్టారు భీమయ్యా?

పిల్లల కార్యక్రమానికి-
“వరదలో బురదోత్సవం”

పెద్దల కార్యక్రమానికి-
“బురదలో వరదోత్సవం”

ఇద్దరూ కలిసి చేసుకునే కార్యక్రమానికి-
“కాలువల్లో విల్లాల విలవిలోత్సవం”

అబ్బా! భీమయ్యా! పేర్లు పెట్టడంలో ఎంత సందర్భ శుద్ధి? ఎంత ఔచిత్యం? ఎంత ప్రాస? ఎంత యతి? తెలుగు చచ్చిపోతోందని ఎవరయ్యా అన్నది?

ఇంతకూ మన విల్లాల విలవిలోత్సవానికి ఎవరు ముఖ్య అతిథి?

ఇంకెవరు? మన హైడ్రా రంగనాథ్ గారే. రాత్రికి జె సీ బీ లు, బుల్డోజర్లు, హెవీ డ్రిల్లర్లతో ముహుర్తానికంటే ముందే వస్తానన్నారు! ఆయనకంటే ఇంకా ముందే మీడియావారు ఎలాగూ వస్తారు. ఇక రాతిరంతా మన విల్లాల్లో జాతరే…జాతర!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్