అమరావతి దేవతల రాజధాని అని, ఇప్పుడు రాక్షసులు పాలిస్తున్నారని, త్వరలోనే ఈ పాలన అంతం కాబోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సమీపంలోని మందడంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం’ పేరిట భోగి మంటలు వేసే కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు. ప్రభుత్వ జీవోల ప్రతులను మంటల్లో వేసి తగులబెట్టారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ భవిష్యత్తు మనదేనని, అమరావతి కేంద్రంగానే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు, పాత వస్తువులు, పనికిరానివి భోగి మంటల్లో వేయడం సంప్రదాయంగా వస్తోందని, ప్రభుత్వ అసమర్ధ, విధ్వంస విధానాలవల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారని బాబు పేర్కొన్నారు. రాజకీయ హింస, అక్రమ కేసులు, మోసపు హామీలను, చీకటి జీవోలను మంటల్లో వేశామని తెలిపారు. టిడిపి-జనసేన కూటమికి అధికారం ఖాయమని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని, ఈ ప్రభుత్వానికి 87 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైందని, పేదల పాలన, పేదలకు సంక్షేమ పాలన మళ్ళీ అమరావతి నుంచే ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు. పండుగ రోజు కూడా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్నారని, వారిని వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు.
రాజధానికి 32 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళుగా రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగి మంటల్లో వేశామని వ్యాఖ్యానించారు. రైతులను లాఠీలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగు జాతికి ఒక కాంతి, క్రాంతి త్వరలోనే వస్తాయని, వచ్చే సంక్రాంతిని అమరావతి రాజధానిలో జరుపుకుందామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ వస్తే అంధకారమేనని, అందుకే టిడిపితో కలిసి పోటీ చేస్తున్నామని, తాము కలవకుండా ఉండేందుకు ఎన్నో కుట్రలు చేశారని పవన్ ఆరోపించారు.