Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనష్టాలకు ప్రేక్షకులే ఇవ్వాలి పరిహారం!

నష్టాలకు ప్రేక్షకులే ఇవ్వాలి పరిహారం!

Covid 19 Impact On Film Industry :

సినిమా ఒక కల్పన. నూటికి నూటొక్క పాళ్ల వ్యాపారం. జీవితంలో ఓడిపోయిన ఎన్నో కథలు సినిమాల్లో గెలుస్తూ ఉంటాయి. సినిమా గెలుపును నిజం గెలుపు అనుకుని అనుకరించి బయట ఎన్నో జీవితాలు ఓడిపోతూ ఉంటాయి.

మందు బాటిళ్లను ముందు పెట్టుకుని, రింగులు రింగులుగా పొగలు వదులుతూ సినిమా అక్కడక్కడా చట్టబద్ధమయిన హెచ్చరికలతో సందేశాలు కూడా ఇస్తూ ఉంటుంది.

కళ వినోదం కోసమే. విజ్ఞానం బై ప్రాడక్ట్. అన్ని సందర్భాల్లో బై ప్రాడక్ట్ ఆశించకూడదు. ఏది కళ? ఏది కాదు? అన్నదానికి ఎవరి కొలమానాలు వారికి ఉంటాయి. అయినా మన చర్చ సినిమా విలువలు, ప్రమాణాల గురించి కాదు కాబట్టి ఆ విషయాన్ని గాలికి వదిలి అసలు విషయంలోకి వెళదాం.

కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను సడలించాయి. వర్షం వచ్చినట్లు రుజువు నేల తడవడం. అలాగే లాక్ డౌన్ ఎత్తేసినట్లు రుజువు థియేటర్లు తెరవడం. తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసి బార్లా అన్ని తలుపులు తెరిచి చాలా రోజులయినా థియేటర్లు తెరవకపోయేసరికి ప్రభుత్వం హర్ట్ అయ్యింది.

నిర్మాతల హిమవన్నగాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు పిలిచారు. థియేటర్లు ఇంకా ఎందుకు తెరవలేదు? అని అడిగారు. చేపా చేపా ఎందుకు ఎండలేదు? అంటే అడ్డొచ్చిన గడ్డి మోపు, మేయని దూడ, వేయని పేడ, మేపని పాలేరు, అవ్వ పెట్టని బువ్వ, ఏడ్చిన పిల్లాడు, కుట్టిన చీమ, బంగారు పుట్ట…లాంటి సహేతుకమయిన అనేక సశాస్త్రీయ కారణాలను నిర్మాతలు కార్యదర్శి కళ్లకు కట్టినట్లు చూపించారు.

Covid 19 Impact On Film Industry :

నిర్మాతలు చూపిన సినిమాను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శిస్తానని కార్యదర్శి బాధ్యతగా సెలవిచ్చారు. నిర్మాతలు చెప్పిన అనేకానేక కారణాల్లో రెండు కారణాలు మాత్రం చాలా విలువయినవి.

1. థియేటర్లలో పెయిడ్ పార్కింగ్ మళ్లీ ప్రవేశ పెట్టాలి. సినిమాలకు వచ్చే ప్రేక్షకుల కార్ల, బైకుల వల్లే నలభై శాతం ఆదాయం వస్తుంది.

2. ఆంధ్రప్రదేశ్ లో కూడా థియేటర్లు తెరిస్తే గానీ- ఇక్కడ తెరవలేం.

కరెంటు చార్జీలు ఎత్తేయాలి. ఇంకేవేవో మినహాయింపులు కూడా అడిగారు. అవన్నీ ఇక్కడ అనవసరం.

కొన్ని సినిమా షోలకు ఎక్కువ రేట్లు, మొదటి వారం వీర బాదుడు రేట్లు…ఇలా ఇప్పటికే మొదటి వారంలోనే ప్రేక్షకులు నిలువు దోపిడీ ఇచ్చుకుంటున్నారు. ఇందులో పార్కింగ్ ఫీజు లేకపోవడం నిజంగా మహాపరాధం. నిర్మాతల నష్టాలకు ఇదొక్కటే కారణం. మొత్తం ఇన్నేళ్లలో వారెంత నష్టపోయారో ప్లస్ కరోనా నష్టం ఇంటూ వారి పూర్వజన్మల నష్టం హోల్ స్క్వయిర్ ప్లస్ బి స్క్వయిర్ కలిపి వెంటనే పెయిడ్ పార్కింగ్ ఫీజుద్వారా వసూలు చేసుకోవడానికి స్వచ్చందంగా బాధ్యతగల ప్రేక్షకులుగా మనమే ముందుకు రావాలి.

ఇన్నేళ్లలో మనం ఉచిత పార్కింగ్ ద్వారా ఆదా చేసుకున్న సొమ్మును చక్ర వడ్డీతోపాటు నిర్మాతలకు భయంతో కూడిన భక్తి వల్ల కలిగిన ఆరాధనాజనిత అపరాధభావంతో చెల్లించాలి. కరోనాతో హాయిగా మనం ఇళ్లల్లో కూర్చుని ఓ టి టి ల్లో సినిమాలు చూడడం వల్ల నిర్మాతలకు కలిగిన నష్టానికి పరిహారంగా మనం మూడు నెలలు తెరిచిన థియేటర్లలోనే కాపురాలు ఉండి, ఒక్కొక్క షోకు విడిగా నిర్మాతకు పే టీ ఎం ద్వారా చెల్లింపులు చేసి రుణం తీర్చుకోవాలి.

ఉదారులయిన ప్రేక్షకులు సంఘాలుగా ఏర్పడి నష్టపోయిన నిర్మాతలను ఇంకా ఏయే రూపాల్లో ఆదుకోవచ్చో ఒక ప్రణాళిక రూపొందించాలి. ప్రేక్షకులను ఎన్ని రకాలుగా పిండుకోవచ్చో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు కూడా నిర్మాతలతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలి.

అవసరమయితే నిర్మాతల ఆర్థిక పరిపుష్టికి, పరిరక్షణకు చట్టాలను సవరించాలి. ఇంకా చాలకపోతే ఏకచక్రపురంలో బకాసురుడికి వంతులవారి వెళ్లి ఆహారమయినట్లు- ప్రేక్షకులే నిర్మాతల నష్టాలకు పరిహారం కావాలి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : తెలుగు తెరపై విరుగుడు లేని విలనిజం .. కోట

RELATED ARTICLES

Most Popular

న్యూస్