7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాతెలుగు తెరపై విరుగుడు లేని విలనిజం .. కోట

తెలుగు తెరపై విరుగుడు లేని విలనిజం .. కోట

Kota Srinivasa Rao A Multi Talented Actor : 

వెలుగు విలువ తెలియాలంటే చీకటిలో నుంచి వెళ్లాలి … మంచికి గౌరవం పెరగాలంటే చెడు ఎలా ఉంటుందనేది అనుభవంలోకి రావాలి. అలాగే ఏ సినిమాలోనైనా హీరో గొప్పతనం పదిమందికి తెలియాలంటే పవర్ఫుల్ విలన్ ఉండాలి. అప్పుడే ఏ కథ అయినా రసవత్తరంగా నడుస్తుంది .. జనం మనసులను గెలుస్తుంది. చెడుపై మంచి విజయం సాధిస్తే పండుగ చేసుకున్నట్టే, హీరో తన ప్రాణాలకు తెగించి విలన్ ఆట కట్టిస్తే ఆడియన్స్ సంతోషపడిపోతారు .. సంబరపడిపోతారు. ప్రేక్షకులు ఎంతగా తిట్టుకుంటే ఆ విలన్ అంత బాగా చేసినట్టు. ఇలా ఒక్క విలన్ పాత్ర విషయంలోనే జరుగుతూ ఉండటం విశేషం.

అలాంటి పవర్ఫుల్ విలన్ పాత్రల్లో ఎస్వీఆర్ .. రాజనాల .. నాగభూషణం .. రావు గోపాలరావు .. ఇలా చాలామంది  తమదైన ప్రత్యేకతను చాటుతూ వచ్చారు. ఆ తరువాత తరంలో ఎక్కువగా వినిపించిన పేరు .. ఎక్కువకాలం వినిపించిన పేరు కోట .. అసలు పేరు కోట శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా ‘కంకిపాడు’ గ్రామంలో ఆయన జన్మించారు. చదువుకునే రోజుల నుంచే ఆయనకి నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ‘ప్రాణం ఖరీదు’ నాటకంలో ఆయనను చూసిన క్రాంతికుమార్, అదే  కథను సినిమాగా నిర్మిస్తూ, కోట శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చారు.

అలా 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. నటన పట్ల ఉన్న ఆసక్తి కారణంగా బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకున్న ఆయన, ఇక పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి పెట్టారు. అలా కొంతకాలం పాటు వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లిన ఆయనకి,ప్రతిఘటన‘ సినిమాతో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో దుర్మార్గుడైన రాజకీయ నాయకుడిగా ‘కాశీ’ పాత్రలో ఆయన జీవించారు. కొత్త మేనరిజంతో సరికొత్త విలనిజానికి ఆయన తెరతీశారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అందులోని విలన్ పాత్రను గురించి మాట్లాడుకోవడం విశేషం .. అదే కోట ప్రత్యేకత.

ఇక అప్పటి నుంచి తెలుగు కథలో హీరోను టెన్షన్ పెట్టేసే ఒక పవర్ఫుల్ విలన్ దొరికిపోయాడు. విలన్ కేటగిరిలో వేషం ఏదైనా .. యాస ఏదైనా అందుకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ ను మార్చేస్తూ డైలాగ్స్ చెప్పడంలో కోట సిద్ధహస్తుడు. బాడీ లాంగ్వేజ్ కీ .. డైలాగ్ కి ఎక్స్ ప్రెషన్ ను మ్యాచ్ చేస్తూ, లోతైన ద్వేషం .. విరుగుడు లేని విలనిజం చూపించడంలో ఆయనకి ఆయనే సాటి. డైలాగ్ ను ఎలా విడగొట్టాలో .. సన్నివేశాన్ని ఎలా పదునెక్కించాలో ఆయనకి బాగా తెలుసు. ‘శత్రువు’ .. ‘గణేశ్’ తరహా సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి.

సహజంగానే తాను ధరించే ప్రతి పాత్రకి ఒక మేనరిజం ఉండేలా ఆయన చూసుకునేవారు. తెరపై ఆయన చెప్పే ఊతపదాలు .. చాలాకాలం పాటు జనం నాల్కలపై నానుతూ ఉండేవి. కోటకు విలనిజం పండించడమే కాదు, కామెడీని పరిగెత్తించడం కూడా తెలుసు. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో ఆయన చేసిన వినోదాల విన్యాసం ఆ సినిమాకే హైలైట్. విరిగిపోయిన కళ్లజోడు ఫ్రేము .. పగిలిపోయిన కళ్లద్దాలలో నుంచి ఓరగా చూస్తూ, ఏదడిగినా ‘నాకేంటి అని’ అంటూ చేతిలో తైలం పడితే తప్ప నోరు విప్పని పాత్రలో ఆయన నాన్ స్టాప్ గా నవ్విస్తారు.

ఇక కామెడీనే కాదు .. కంటతడి పెట్టించడం కూడా కోటకి బాగా తెలుసు. మచ్చుకు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఒక వైపున కొడుకు అంటే ప్రేమ … మరో వైపున కోడలు అంటే కూతురంతటి అనురాగం .. కానీ ఆమెకి సంతానం కలగదని తెలిసి, వంశాంకురం కోసం తపించిపోయే పాత్రలో ప్రేక్షకులు కొత్త కోట శ్రీనివాసరావును చూస్తారు. ఇక ‘హలో బ్రదర్’ సినిమాలోని ‘తాడి మట్టయ్య’ పాత్ర కూడా ఆయన ఎమోషన్ కి సరిహద్దుగా నిలిచేదే. ఇలా ఒకటా .. రెండా .. 4 దశాబ్దాలకి పైగా ఆయన చేసిన ప్రయాణం గురించి 4 పేరాల్లోనో .. 4 పేజీల్లోనో చెప్పుకోలేం. కోట చేసిన విభిన్నమైన సినిమాలు … వైవిధ్యమైన పాత్రలను గురించి చెప్పుకోవాలంటే, అసమానమైన ఆయన అభినయంపై రాసిన ఒక గ్రంథం గురించి మాట్లాడుకోవడమే అవుతుంది.

సీరియస్ విలన్ గా … కామెడీ టచ్ తో కూడిన విలన్ గా .. కార్పొరేట్ విలన్ గా .. విలేజ్ స్థాయి విలన్ గా ఇలా విలనిజంలో కోట శ్రీనివాసరావు తన విశ్వరూపం చూపించారు. రంగస్థలంపై తనకి గల అపారమైన అనుభవంతో ఆయన ప్ర్రేక్షకులను కట్టిపడేశారు. విలనిజాన్ని కొత్తదనం దారుల్లో .. కొత్త తరం తీరాల్లో పరుగులు తీయించారు. ఆయన వంట్లో ఓపిక తగ్గేవరకూ ఆయనలోని విలనిజాన్ని ఎవరూ ఎదుర్కోలేపోయారు .. మరే విలన్ కూడా ఆయన దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. అందువల్లనే ‘పద్మశ్రీ’ పురస్కారం ఆయనను అలంకరించింది.

తెలుగు తెరకి మున్ముందు చాలామంది ప్రతినాయకులు పరిచయం కావొచ్చు. కోట ప్రభావం వాళ్లపై పడవలసిందే తప్ప, వాళ్ల ప్రతిభ కోటను మరిచిపోయేలా ఎప్పటికీ చేయలేదు. ఎందుకంటే ఇంతకాలం పాటు … ఇన్ని విలక్షణమైన విలన్ పాత్రలు మరొకరికి దక్కే అవకాశాలు లేవు .. రావు. అందుకే విలన్లు ఎందరు వచ్చినా కోట ఒక్కడే .. కోట అంటే కోటికి  ఒక్కడే. ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుందాం.

(జూలై 10, కోట జన్మదినం – ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : జానీ మాస్టర్ హీరోగా ‘దక్షిణ’

RELATED ARTICLES

Most Popular

న్యూస్