Saturday, November 23, 2024
HomeTrending NewsBJP-AP: నిధుల విడుదలపై విమర్శలు సరికాదు: జీవీఎల్

BJP-AP: నిధుల విడుదలపై విమర్శలు సరికాదు: జీవీఎల్

రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేయబోదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇటీవల కేంద్రం విడుదల చేసిన రెవెన్యూలోటు దీనికి నిదర్శనమని చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అడ్డగోలు వ్యవహారాలపై అసెంబ్లీ స్థాయిలో ఛార్జ్ షీట్లు వేసి నిలదీస్తున్నామని అన్నారు. ఒక రాజకీయ పార్టీగా రాజీలేని పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వంపై పోరాటం- నిధుల విడుదల వేర్వేరు అంశాలని తేల్చి చెప్పారు.

కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని పక్షాలు దురాలోచన చేస్తున్నాయని.. నిధుల లేమితో జగన్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడితే వారికి మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారని విమర్శించారు.  ఇది సంకుచిత భావన అని, దానితో రాష్ట్రం నష్టపోతుందని అభిప్రాయపడ్డారు.  మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు మోడీ ప్రభుత్వం ఇచ్చిన వరం అని చెప్పకుండా… తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుగా రాలేదని, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రత్యేకంగా చేసిన కేటాయింపులని వివరించారు.

2016-17 నుంచి 2020-21వరకూ ఐదేళ్లపాటు రెండు ప్రభుత్వాలూ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 16,924  కోట్లు అదనపు రుణం చేశాయని… దీన్ని గమనించిన కేంద్రం 2021-22లో 3,900కోట్లు, 2022-23లో 6,000 కోట్లు కోతలు విధించి అప్పులను నియంత్రించిందని గణాంకాలు వివరించారు. అయితే,  జగన్ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు మిగిలిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు వాయిదాలలో కోత విధించేందుకు కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసిందని చెప్పారు.

రాష్ట్రానికి రెవిన్యూ లోటు నిధులు కేంద్రం కేటాయిస్తే దాన్ని కూడా ప్రశ్నించే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10,461 కోట్ల రూపాయలు ప్రత్యేక గ్రాంటు కింద ఇచ్చే నిబంధన లేదని, అందుకే గతంలో ఈ నిధులను కేంద్రం మంజూరు చేయలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు సడలించి మరీ ఈ నిధులను ఇచ్చిందన్నారు.  విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏర్పడిన లోటు కాబట్టి దీన్ని కేంద్రం నాడు ఇవ్వలేదన్నారు.  ఈ నిధులను ఎలా వినియోగించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేఛ్చ ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్