Saturday, January 18, 2025
HomeTrending Newsపోషకాహారం.. ప్రపంచానికి సవాల్ : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

పోషకాహారం.. ప్రపంచానికి సవాల్ : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

నాణ్య‌మైన పోష‌కాహారం ప్ర‌పంచం ముందున్న స‌వాల్ అని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక అని తెలిపారు. ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సంద‌ర్భంగా ‘వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై’ నిర్వహించిన సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రులు సూర్యప్రతాప్ షాహి, కమల్ పటేల్, బీసీ పాటిల్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న జీవరాశులలో మేధోపరంగా అతి తెలివైన వాడు మానవుడని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉచ్చస్థితికి చేరుకున్నదన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నందున దానికి అనుగుణంగా కేంద్రం చర్యలు ఉండాలని సూచించారు. సాగు అనుకూల భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్‌ది రెండో స్థానం అని తెలిపారు. దేశంలో ఉన్న భూకమతాలు అన్నింటినీ క్రాప్ కాలనీలుగా విభజించాలని డిమాండ్ చేశారు.
రైతుల‌కు ప్రోత్సాహ‌కాలు అందించాలి..

దేశంలోని వివిధ ప్రాంతాలు, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో గుర్తించి ఆ మేరకు అక్కడ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాల‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ పంటల నుండి రైతాంగాన్ని మళ్లించడానికి దేశ, విదేశాల్లో అవసరమైనటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాల‌న్నారు. వ్యవసాయ రంగం విషయంలో కేంద్రం ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు.

భార‌త్ ఆ దుస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాలి..

ఎగుమతులు, సేకరణ కేంద్రం చేతుల్లో ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పంటల వైవిధ్యీకరణకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. అప్పుడే రైతాంగం సాంప్రదాయ సాగును వీడి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతార‌ని తెలిపారు. దేశంలో నూనెగింజలు, పప్పుదినుసుల కొరత ఉన్నది. ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు దిగుమతుల వెచ్చించాల్సి వస్తున్నది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ దేశం అయిన భారత్ ఆ దుస్థితి నుండి బయటపడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఉజ్వ‌లంగా తెలంగాణ వ్య‌వ‌సాయం..

ప్రపంచానికి అన్నం పెట్టగలిగే భారత్ మన అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతలా అభివృద్ధి చెందిన యుగంలో సముచితం కాదన్నారు. 58 శాతం జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగాన్ని విస్మరించకుండా దానిని ప్రధాన రంగంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక క్రమ పద్దతిలో చర్యలు చేపట్టింద‌ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణ వ్యవసాయం నేడు ఉజ్వలంగా ఉన్నది.. దేశానికే తలమానికంగా మారింద‌ని మంత్రి అన్నారు.

ప‌టిష్టంగా సాగునీటి వ్య‌వ‌స్థ‌.

ఏడో శతాబ్దంలోనే తెలంగాణలో కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులతో సాగునీటి వ్యవస్థ పటిష్టంగా ఉన్నద‌ని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు. సమైక్యపాలనలో చెరువులు, కుంటలు ధ్వంసమయ్యాయి.. గత ఎనిమిదేళ్లలో రూ.లక్ష 25 వేల కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలు, ఇతర కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. ప్రస్తుతం సాగునీటి రంగంలోనే కాక మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, తొమ్మిది విడతలలో రూ.58 వేల కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమచేయడం, రైతుభీమా పథకం కింద 88,175 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున అందించి వ్యవసాయ రంగానికి చేయూత నివ్వడం జరిగింది. ఈ చర్యల మూలంగా తెలంగాణ పంటల ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచింది.. తెలంగాణ‌ పంటల కొనుగోలుకు కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితికి చేరుకున్నామ‌ని తెలిపారు.

వ్య‌వ‌సాయ రంగం వైపు యువ‌త‌..
తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇచ్చిన చేయూత మూలంగా మిగతా రాష్ట్రాల మాదిరిగా ఎవరూ వ్యవసాయ రంగాన్ని వీడడం లేదు.. కొత్తగా యువత వ్యవసాయరంగం వైపు మళ్లుతున్నదని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. వ్యవసాయరంగాన్ని ఉపాధిగా ఎంచుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. వ్యవసాయ రంగం బలోపేతం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతువేదిక నిర్మించడం, వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అందజేస్తున్నామ‌ని తెలిపారు. ప్రతి గ్రామానికి రైతుబంధు సమితులను ఏర్పాటుచేసి రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తున్నామ‌ని చెప్పారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నామ‌ని మంత్రి తెలిపారు. ఢిల్లీ సదస్సులో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగా బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై సాగిన మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్ర‌సంగం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆసక్తిగా విని వివిధ రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు మంత్రి నిరంజ‌న్ రెడ్డిని అభినందించారు.

Also Read : చివరి భూముల వరకు సాగునీరు: మంత్రి నిరంజ‌న్

RELATED ARTICLES

Most Popular

న్యూస్