Saturday, January 18, 2025
HomeTrending Newsఅలయ్-బలయ్ తో సాంస్కృతిక పునరుజ్జీవనం

అలయ్-బలయ్ తో సాంస్కృతిక పునరుజ్జీవనం

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని… అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని జల్ విహార్ లో నిర్వహించిన అలయ్ – బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు – ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.


స్వరాజ్య ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఏకం చేసేందుకు వినాయక చవితి ఉత్సవాలకు పిలుపునిచ్చిన  బాలగంగాధర్ తిలక్ ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అదే స్ఫూర్తితో ప్రజలందరిలో ఏకతా భావాన్ని నింపేందుకు కోవిడ్ సమయాన్ని మినహాయిస్తే 13 ఏళ్ళుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలిపారు.


సమాజాన్ని కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా ఒకచోట చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉందన్న ఉపరాష్ట్రపతి, గతమే గాక వర్తమాన, భవిష్యత్తుల్లోనూ సమాజాన్ని ఏకం చేసేది సంస్కృతే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలంతా ఒకే చోటకు చేరి మంచి ఆలోచనలు పంచుకున్నప్పుడు ఏదైనా సాధించేందుకు వీలు పడుతుందని, తోటి వారిని ఎలా గౌరవించుకోవాలో అలయ్ – బలయ్ లాంటి కార్యక్రమాలు తెలియజేస్తాయన్నారు. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.


తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖామాత్యులు జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం శాఖ మంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ వైద్యులు నాగేశ్వర రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ యెల్లా, బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మహిమా దత్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్